ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలే ప్రధాన అజెండాగా ఇవాళ విజయవాడలో తెదేపా రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం జరగనుంది. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మాజీ మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులు హాజరుకానున్నారు. అమరావతిపై ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ అన్ని జిల్లాల్లో ఉద్యమాలు చేయడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేందుకు అనుసరించే వ్యూహాలను ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. రేషన్ కార్డుల తొలగింపు, విద్యుత్, ఆర్టీసీ చార్జీల పెంపుపై ఉద్యమ కార్యాచరణ ఖరారు చేయనున్నారు.
అర్హులైన పేదల పింఛన్లు, రేషన్ కార్డులు తొలిగించడంపై ఇప్పటికే పార్టీ అధిష్ఠానం పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఆందోళనలు చేపట్టింది. ఈ ఆందోళనలను మరింత ఉద్ధృతం చేసేలా చంద్రబాబు ఈ సమావేశంలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా వ్యూహాలు రచించనుంది. గత ప్రభుత్వంలో పని చేసిన అధికారులపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును చర్చించే అవకాశం ఉంది. 55 రోజులుగా దీక్షలు చేస్తున్న రాజధాని రైతులు, విద్యార్థులపై పోలీసుల వైఖరిపైనా చర్చించనున్నారు. రైతులకు అండగా ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ గళం వినిపించేలా కార్యకర్తలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. రాజధాని రైతులకు మద్దతుగా మండలిలో ఎమ్మెల్సీలు పోరాడిన తీరును అభినందిస్తూ తీర్మానం పెట్టనున్నారు.