తెదేపా హయాంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించినా.. వారు ఇంకా ఏదో ఆశించి వైకాపా వైపు మొగ్గుచూపారని తెదేపా సీనియర్ నేతలు తెలిపారు. విజయవాడలో తెదేపా విస్తృతస్థాయి సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. నియోజకవర్గాల వారీగా సమీక్ష జరిపితే క్షేత్రస్థాయిలో ఉండే సమస్యలేంటో తెలుస్తాయని నేతలు వివరించారు. తెదేపా హయాంలో ఒక సామాజిక వర్గానికే పదవులు అంటగడుతున్నారని ఆరోపించారని.. ఇప్పుడు వైకాపా ప్రభుత్వంలో మాత్రం ఆయన చేస్తుందేమిటో అందరూ గ్రహించాలనీ అన్నారు. పార్టీలో స్వార్థపరులకు పదవులు ఇస్తున్నారని మరో సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు నేతలు ధన బలంతో పదవులు అనుభవించి పార్టీ నుంచి వెళ్లిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో యువతకు, మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. టీడీఎల్పీ ఉపనేత పదవిని బీసీలకు అప్పగించాలని కోరినట్టు సమాచారం.
సమావేశానికి విజయవాడ ఎంపీ కేశినేని నాని రాకపోవటం చర్చనీయాంశమైంది. ఆయనతో పాటు.. శాసనసభ్యులు పయ్యావుల కేశవ్, గంటా శ్రీనివాసరావు సమావేశానికి రాకపోవటంపై నేతలు పలు రకాలుగా మాట్లాడుకుంటున్నారు. మరో సీనియర్ నేత యనమల రామకృష్ణుడు వ్యక్తిగత పర్యటనలో భాగంగా సమావేశానికి రాలేకపోతున్నానని తెలిపారు. కేంద్రమాజీ మంత్రి అశోక్ గజపతిరాజు అనారోగ్య కారణంగా రావటంలేదని సమాచారమిచ్చారు.