ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం షాక్​కు గురి చేసింది' - విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై తెదేపా నేతల ఆవేదన

విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం షాక్​ గురిచేసిందని తెదేపా నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. నష్టాలు వస్తున్నాయని ప్రైవేటీకరణ చేసే ఆలోచన సరైంది కాదని గంటా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. విశాఖ స్టీల్ కొట్టేయటానికి ఏ1, కొత్త ఏ2, పాత ఏ2 దొంగల ముఠా స్కెచ్ వేసిందని అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు.

tdp leaders talked about visakha steel plant
విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై తెదేపా నేతల ఆవేదన

By

Published : Feb 5, 2021, 2:55 PM IST

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటుపరం కాకుండా ఉండేందుకు అవసరమైతే ప్రజాప్రతినిధులంతా తమ పదవులకు రాజీనామా చేయాలని మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు కోరారు. సీఎం చొరవ తీసుకుని అఖిలపక్ష నేతల్ని దిల్లీ తీసుకెళ్లి ప్రధానిని కలిసి ప్రైవేటీకరణ కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. అనేక ప్రైవేటు సంస్థలకు రాష్ట్రంలో ఉన్న ఐరన్​ ఓరు గనులు ఇస్తున్నందున విశాఖ స్టీలు ప్లాంటుకు ఈ మేర గనులు కేటాయించి నష్టాలు తగ్గించుకునే వెసులుబాటు కల్పించాలని సూచించారు.

రాజకీయాలు, పార్టీలకు అతీతంగా స్టీలు ప్లాంట్​ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటుపరం కాబోతుందనే వార్త అందరినీ షాక్​కు గురి చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎందరో ప్రాణ త్యాగాలతో ఆనాడు ఉక్కు కర్మాగారం సాధించామని గుర్తు చేసుకున్నారు. నష్టాలు వస్తున్నాయని ప్రైవేటీకరణ చేయాలనే కేంద్రం ఆలోచన సరైంది కాదని అభిప్రాయపడ్డారు.

ఏ1, ఏ2 లు విశాఖ స్టీల్ ప్లాంట్​పై కన్నేశారు
ఉత్తరాంధ్ర విధ్వంసానికి కుట్రలు పన్నుతున్న ఏ1, కొత్త ఏ2, పాత ఏ2, ఇప్పుడు ఏకంగా విశాఖ స్టీల్ ప్లాంట్​పై కన్నేశారని తెదేపా నేత అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. రూ.20 వేల ఎకరాల విశాఖ స్టీల్ ప్లాంట్​ కొట్టేయటానికి ఈ దొంగల ముఠా స్కెచ్ వేసిందని అన్నారు. అందుకే కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపారని ఆరోపించారు. తన బినామీ కంపెనీతో.. స్టీల్ ప్లాంట్ కొనబోతున్నారని వ్యాఖ్యానించారు. 20 వేల ఎకరాలు, ఎకరా 5 కోట్లు, లక్ష కోట్ల ఆస్తి, కేవలం వెయ్యి కోట్లకు కొట్టేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో ఏ కుట్ర లేకపోతే ... విశాఖ స్టీల్ ప్లాంట్​ని రాష్ట్ర ప్రభుత్వమే కొనాలని సూచించారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అని చాటి చెప్పాలని కోరారు. ఆర్టీసీని ప్రభుత్వంలో తీసుకున్న వాళ్లు.. వెయ్యి కోట్లతో స్టీల్ ప్లాంట్ కొనలేరా అని ప్రశ్నించారు.

వైకాపా ఎందుకు మాట్లాడటం లేదు..

విశాఖను రాజధాని చేస్తామని చెబుతున్న వైకాపా ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఎందుకు మాట్లాడటం లేదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర నిలదీశారు. ముఖ్యమంత్రి జగన్ కేసులకు భయపడి కేంద్రం అడమన్నట్లు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్​ను అంగుళం ప్రైవేటీకరణ చేసినా సహించేది లేదని హెచ్చరించారు. హుదూద్ తుఫాన్ సమయంలో చంద్రబాబు అక్కడే ఉండి మళ్లీ విశాఖ నగరానికి పునర్ వైభవం తీసుకువచ్చాకే అమరావతికి వచ్చారని గుర్తు చేశారు. వైకాపా అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని విశాఖ ప్రజలు ఆలోచించాలని కోరారు.

ఇదీ చూడండి.

ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ యత్నాలను నిరసిస్తూ కార్మికుల ర్యాలీ

ABOUT THE AUTHOR

...view details