Yanamalakuduru Bridge : కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో యనమలకుదురు గ్రామాన్ని- విజయవాడ బందరు రోడ్డుకు అనుసంధానించేందుకు వీలుగా తెదేపా ప్రభుత్వం ఐదేళ్ల క్రితం వంతెన నిర్మాణ పనుల్ని చేపట్టింది. తెదేపా ప్రభుత్వం దిగిపోయేనాటికి 90శాతం పనులు పూర్తయ్యాయి. వైకాపా అధికారంలోకి వచ్చాక.. ఎక్కడి పనులు అక్కడే స్తంభించిపోయాయి. దీన్ని నిరసిస్తూ యనమలకుదురు బ్రిడ్జికి ఇదేం ఖర్మ అంటూ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ నిరసన కార్యక్రమం చేపట్టారు. కొందరు వైకాపా నేతలు అక్కడికి చేరుకుని ప్రతిగా నినాదాలు చేయటంతో ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాలు బాహీబాహీకి దిగే క్రమంలో పోలీసులు వారిని నెట్టడంతో తోపులాట జరిగింది.
వైకాపా నేతలు, పోలీసులు కుమ్మక్కై తమ కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారంటూ తెదేపా నేతలు బ్రిడ్జిపై బైఠాయించి నిరసన కొనసాగించారు. బ్రిడ్జిపైకి ఎక్కేందుకు పెట్టుకున్న నిచ్చెనను పైకి తీసేసుకోవటంతో వారిని కిందకు దించటం పోలీసులకు కష్టతరమైంది. పోలీసులు తమ నేతల్ని అరెస్టు చేస్తే బందరు కాలవలోకి దూకుతానంటూ బోడేప్రసాద్ బ్రిడ్జ్ బెదిరించారు. పోలీసులు లైఫ్ జాకెట్లు, తాడులు కూడా సిద్ధం చేశారు. బ్రిడ్జి పైకెక్కి తెదేపా నేతల్ని దించే మార్గం కనిపించకపోవటంతో పోలీసులు చర్చల మార్గం ఎంచుకున్నారు.