ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంపై కృష్ణా, గుంటూరు జిల్లాల వైకాపా నేతలకు చీమ కుట్టినట్టు కూడా లేదని తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆక్షేపించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్రకు ఒక్క పరిశ్రమ కూడా రాలేదని ఆరోపణలు చేశారు. డేటా సెంటర్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ను ఎందుకు వెళ్లగొట్టారని నిలదీశారు. అమరావతిలో ఉన్న భవనాలను కాదని విశాఖలో కొత్తవి కడతారా అంటూ మండిపడ్డారు. విద్యార్థులను చదువుకోనివ్వకుండా ఏయూలో ఆఫీసులు పెడతారా అని ప్రశ్నించారు. అమరావతిపై వైకాపాకి ఎందుకంత కక్ష అని నిలదీశారు.
తెదేపా హయాంలోనే అమరావతిలో... పేదలకు 5 వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని అనురాధ తెలిపారు. ఆ నిర్మాణాలను వైకాపా ప్రభుత్వం నిరుపయోగంగా మార్చిందని మండిపడ్డారు. మూడు రాజధానుల నిర్ణయంతో ప్రజల జీవితాలు తలకిందులయ్యాయన్నారు. 13 జిల్లాల అభివృద్ధితో వైకాపాకి సంబంధం లేదా అని ప్రశ్నించారు. అమరావతి నిర్మాణం ఆగిపోవడంతో లక్షమంది కూలీలు రోడ్డున పడ్డారని... వారి ఆకలి బాధ ఈ ప్రభుత్వానికి తెలియదా అంటూ నిలదీశారు.