హైకోర్టులో తెదేపా అత్యవసర వ్యాజ్యం... ఎందుకంటే ? - ఇసుక కొరతపై తెదేపా నిరసన
ఇసుక కొరతపై తెదేపా ఆధ్వర్యంలో కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం కోనేరు కూడలి వద్ద దీక్ష చేపట్టడానికి పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో అత్యవసరంగా వ్యాజ్యం దాఖలైంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తి ఈ వ్యాజ్యంపై విచారణ జరిపి పూర్తి వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించారు.
ఈ నెల 11, 12 తేదీల్లో 36 గంటల నిరవధిక దీక్ష కార్యక్రమానికి మచిలీపట్నం డీఎస్పీ అనుమతి నిరాకరించడాన్ని సవాలు చేస్తూ బందరు పట్టణ తేదేపా ప్రధాన కార్యదర్శి పిప్పళ్ల వెంకట కాంతారావు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ తరఫున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ అనుమతి నిరాకరించడానికి గల కారణాల్ని పోలీసులు తెలపలేదన్నారు. ఇసుక కొరతపై నిరసన, కార్మికులకు అండగా శాంతియుతంగా చేపట్టే కార్యక్రమానికి అనుమతి నిరాకరించటం తగదని కోర్టుకి వివరించారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాసా జగన్ మోహన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ అదే ప్రాంతంలో తెదేపాతో పాటు ప్రత్యర్థి పార్టీ ఒకేసారి కార్యక్రమాలు నిర్వహించనున్నాయని తెలిపారు. శాంతిభద్రతలకు భంగం కలిగే అవకాశం ఉన్నందున ఇరుపార్టీల అభ్యర్థనలను తిరస్కరించామన్నారు. ధర్నాలు నిర్వహించడానికి ప్రత్యేకంగా ధర్నాచౌక్ ఉందన్నారు. ప్రస్తుతం సిద్ధంగా ఉందో లేదో తెలుసుకోవడానికి గడువు కావాలన్నారు. ఆ వాదనలపై పిటిషనర్ తరఫు న్యాయవాది స్పందించారు. తెదేపా దీక్షకు అనుమతి నిరాకరించడానికే అదే స్థలంలో వైకాపా వ్యతిరేక ప్రదర్శన చేపడుతున్నట్లు చెబుతున్నారన్నారు. ఇరుపార్టీలకు వేర్వేరు తేదీల్లో కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అనుమతిచ్చేలా ఆదేశించాలని కోరారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయమూర్తి వివరాలు సమర్పిస్తూ ప్రమాణపత్రం దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.