ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రజాస్వామ్య మూలాల్ని నమిలేస్తున్న అవినీతి - supreme court latest news

రాజ్యాంగం ఎంత బాగున్నా అమలు చేసేది చెడ్డవారైతే.. ఫలితాలూ చెడుగానే ఉంటాయి. న్యాయం అన్న పదానికి రాజ్యాంగంలో విస్తృతార్థం ఉంది. ఏషియన్‌ లా ఇన్‌స్టిట్యూట్‌ కాన్ఫరెన్స్‌లో సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ అన్నారు. న్యాయం అంటే... ప్రజలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం చేయడమేనని అభిప్రాయపడ్డారు.

సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ
సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ

By

Published : Nov 8, 2020, 6:20 AM IST

‘న్యాయం’ అన్నది ఒక పదంలా కనిపించినా భారత రాజ్యాంగంలో దానికి విస్తృతార్థం ఉందని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పేర్కొన్నారు. న్యాయం అంటే... ప్రజలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం చేయడమేనని అభిప్రాయపడ్డారు. సామాజిక శాంతి కోసం ప్రభుత్వాలు ఆ కర్తవ్యాన్ని నెరవేర్చటమే కాకుండా ఆ విషయాన్ని అన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలకూ తెలియ చెప్పాలని అభిప్రాయపడ్డారు. శనివారం జరిగిన ఏషియన్‌ లా ఇన్‌స్టిట్యూట్‌ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ‘ఆసియాలో చట్టం, న్యాయం’ అనే అంశంపై మాట్లాడారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఎన్నో సామాజిక సమస్యలతో పాటు ఉగ్రవాదం, సైబర్‌ నేరాలు, వలసలు, పర్యావరణం తదితర విపత్తులను ఎదుర్కొంటున్నాయన్నారు. ఈ సమస్యలు ప్రపంచమంతటా ఒకేలా ఉన్నాయని, అందుకే వాటికి ఏకగ్రీవంగా పరిష్కారాలు కనుగొనాల్సి ఉందని పిలుపునిచ్చారు. ఆరోగ్య సంక్షోభంగా ప్రారంభమైన కరోనా తదనంతరం ఆర్థిక, సామాజిక, రాజకీయ సవాళ్లను విసిరింది. ఈ నేపథ్యంలో తలెత్తిన అవాంఛనీయ పరిణామాలు అత్యవసర చర్యలకు దారితీశాయి. ఫలితంగా ప్రజల కదలికలపైనా పరిమితులు విధించాల్సి వచ్చింది. ఇలాంటి సమయంలో న్యాయ వ్యవస్థ అన్నింటికీ ఒకే సూత్రాన్ని అమలుచేయకుండా పరిస్థితులను బట్టి వ్యవహరించాలని జస్టిస్‌ రమణ పేర్కొన్నారు. వివిధ ముఖ్యాంశాలపైనా ఆయన మాట్లాడారు.

న్యాయం చేయడం అన్ని వ్యవస్థల బాధ్యత
‘‘మన రాజ్యాంగంలో న్యాయం గురించి సంకుచిత భావన లేదు. రాజ్యాంగం ఉద్దేశం, దాని వెనకున్న ఆకాంక్షల గురించి రాజ్యాంగ పీఠిక చాటి చెబుతుంది. న్యాయం అంటే అర్థం సామాజిక, ఆర్థిక, రాజకీయ రూపాల్లో న్యాయం చేయడమేనని స్పష్టం చేస్తుంది. సంపూర్ణ న్యాయం చేసే అధికారాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 142 సుప్రీంకోర్టుకిస్తోంది. అదే సమయంలో కేవలం న్యాయం చేయడం వరకే కోర్టుల బాధ్యత అన్న భావన సరికాదని రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 38 చెబుతోంది. ప్రభుత్వం సామాజిక శాంతిని నెలకొల్పాలంటే అందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయంగా న్యాయం చేయడంతో పాటు, ఆ విషయాన్ని జాతీయ జీవన స్రవంతిలో ఉన్న అన్ని వ్యవస్థలకూ తెలియజెప్పాలి. న్యాయం చేసే అధికారాన్ని భారత రాజ్యాంగం అన్ని వ్యవస్థలకూ కల్పించింది’’ అని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ తెలిపారు.

అవినీతి సాధారణమైతే వ్యవస్థలపై విశ్వాసం పోతుంది

‘‘అవినీతి...ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య వ్యవస్థల మూలాలను తినేస్తోంది. రాజ్యాంగం ఎంత బాగా ఉన్నప్పటికీ దాన్ని అమలు చేసేవారు చెడ్డవారైతే చెడు ఫలితాలనే ఇస్తుంది. ఒకవేళ రాజ్యాంగంలో లోపాలున్నప్పటికీ అమలుచేసేవారు మంచివారైతే దండిగా మేలు జరుగుతుందని రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఛైర్మన్‌గా డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ అప్పుడే చెప్పారు. ఎక్కడైతే అవినీతి సాధారణమైపోతుందో అక్కడ వ్యవస్థలపై ప్రజావిశ్వాసం సన్నగిల్లిపోతుంది. అంతిమంగా ప్రజాస్వామ్య విలువలను వదులుకోవాల్సి వస్తుంది. భారత దేశంలో న్యాయం, చట్టం రెండూ రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి. చట్టంలోని అంశాలతో విభేదించడం, దానికి భాష్యం చెప్పడం అన్నది నిరంతరంగా సాగుతూనే ఉంటుందని సుదీర్ఘకాలం న్యాయవాదిగా, న్యాయమూర్తిగా పనిచేసిన అనుభవంతో తెలుసుకున్నా. అయితే మన దేశ సుస్థిరత మాత్రం రాజ్యాంగం నిర్దేశించిన న్యాయ సూత్రాలను అనుసరించి వివాదాలను విజయవంతంగా పరిష్కరించడంపైనే ఆధారపడి ఉంటుంది’’ అని జస్టిస్‌ రమణ వివరించారు.

ఇవీ చదవండి

సీఆర్డీఏ భవితవ్యం ఏమిటో?

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details