కృష్ణా-పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దులోని ఉప్పుటేరును ఆనుకుని కలిదిండి మండలంలో మట్టగుంట,సున్నంపూడి,దుంపలకోడుదిబ్బ,చినతాడినాడ గ్రామాలున్నాయి.ప్రాథమికోన్నత స్థాయివరకే ఇక్కడ విద్య అందుబాటులో ఉండేది.ఉన్నత పాఠశాల విద్యకోసం ఉప్పుటేరు దాటి వెళ్లాల్సిన పరిస్థితి.ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రాథమికోన్నత పాఠశాలకు,జడ్పీ ఉన్నత పాఠశాలలకు కనీసం3కిలోమీటర్ల దూరం ఉండాలి. 3గ్రామాలకు జడ్పీ ఉన్నత పాఠశాల3కిలోమీటర్ల దూరంలోనే ఉన్నందున మట్టగుంటలోని ప్రాథమికోన్నత పాఠశాలకు ఉన్నత పాఠశాలగా వర్గోన్నతి కల్పించాలని ఎప్పుటినుంచో ఆందోళన చేస్తున్నారు.
విద్యార్థుల కష్టాలు తీర్చిన కలెక్టర్ - schools
చదువుల కోసం ఊరు, ఏరు దాటి వెళ్లాలి. తమ పిల్లలు పడవపై నిత్యం అక్షర పయనం చేస్తుంటే ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని తల్లిదండ్రుల్లో ఆందోళన. ఉదయం వెళ్లిన పిల్లలు క్షేమంగా ఇంటికి తిరిగొచ్చే వరకూ కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూసే పరిస్థితి. ఈ బాధలన్నీ కృష్ణా జిల్లా కలెక్టర్ చొరవతో తొలగిపోయాయి. ఆయన ఏంచేశారు? ఎవరికోసం చేశారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే...
ఇదే విషయంపై ఈటీవీ-ఈనాడు ఎప్పటికప్పుడు కథనాలు ఇస్తూనే ఉన్నాయి.ఈ కథనాలను చూసిన కలెక్టర్ ఇంతియాజ్ నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిస్థితి తీవ్రతను గమనించారు.మట్టగుంటలో వెంటనే తొమ్మిదో తరగతిని ఏర్పాటు చేయడంతో పాటు ఆంగ్ల మాధ్యమాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఆదేశించారు.
తొమ్మిది,పదో తరగతులు అందుబాటులో లేనందున ఉప్పుటేరుకు అవతలవైపున ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలోని కలవపూడి జడ్పీ ఉన్నత పాఠశాలకు విద్యార్థులు వెళ్లేవారు.పడవపై రోజూ ప్రయాణం ఉప్పుటేరు దాటేవారు.చాలామంది ఇలా పంపేందుకు భయపడి తమ పిల్లలను చదువు మాన్పించేశారు.మరికొందరు పిల్లలు రోజూ క్షేమంగా ఇంటికి తిరిగొచ్చే వరకూ ఆందోళన చెందుతూ ఉండేవారు.కలెక్టర్ ఇంతియాజ్ నిర్ణయంతో ఇప్పుడు మట్టగుంట పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగింది.ఉపాధ్యాయుల కొరతను తీర్చాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.