ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ట్యాంపరింగ్​కు తావు లేని ఈవీఎంల రూపకల్పన - vv pat

ఈవీఎమ్ ట్యాంపరింగ్... ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ రాజకీయ పార్టీల నుంచి తరచూ వస్తోన్న ఆరోపణ. దొంగ ఓట్లు పడ్డాయని, పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎమ్​లు మొరాయించాయని... ఇలా రకరకాల ఆరోపణలు వెల్లువెత్తుతాయి. వీటికి పరిష్కారం చూపేలా ఇంజినీరింగ్ చదివే  తెలుగమ్మాయిలు అధునాతన సాంకేతికతతో ఈవీఎం యంత్రాలను తయారు చేశారు. ఆధార్ అనుసంధానంతో పనిచేసే ఈ యంత్రాలు...ట్యాంపరింగ్...  రిగ్గింగ్​కు తావు ఉండదని బల్లగుద్ది మరీ చెబుతున్నారు.

తాము రూపొందించిన ఈవీఎంను చూపుతున్న విద్యార్థినులు

By

Published : May 9, 2019, 11:02 AM IST

ఈవీఎం-2.ఓ

ఎన్నికల్లో పారదర్శకత కోసం ఎన్నికల కమిషన్ తీసుకువచ్చిన ఈవీఎమ్​లలో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. వీటికి చెక్​పెట్టేలా కృష్ణాజిల్లాకు చెందిన ఇద్దరు తెలుగమ్మాయిలు సరికొత్త ఈవీఎంలను రూపొందించారు. మచిలీపట్నంలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో సీఈసీ చదువుతోన్న నాగజ్యోతి, చరిత... అతి తక్కువ ఖర్చులో అధునాతన ఈవీఎంను రూపొందించారు.

పనిచేస్తుంది ఇలా..

ప్రస్తుతం ఉండే ఈవీఎం వ్యవస్థలో కంట్రోల్ యూనిట్ సహా బ్యాలెట్ బాక్స్తోపాటు ఓటు ఎవరికి వేశామో చూసేందుకు వి.వి. ప్యాట్ అనుసంధానించి ఉంటోంది. వీటన్నింటినీ యథాతథంగా కొనసాగిస్తూనే అదనంగా మరిన్ని సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించారు. ముందుగా ఇంటర్నెట్ సాయంతో ఈవీఎంను ఆధార్ వ్యవస్థకు అనుసంధానించారు. వేలి ముద్ర తీసుకునే పరికరాన్ని, ల్యాప్ టాప్ ను అమర్చారు. కీ బోర్డును ,డిస్ ప్లే బోర్డును , ప్రింటర్ ను కలిపారు. పోలింగ్ కేంద్రంలోకి వచ్చిన ఓటర్ తెచ్చిన ఆధార్ కార్డు లోని నెంబర్ ను తొలుత ఎంటర్ చేస్తారు. వెంటనే సంబంధిత ఓటరు ఫొటో కంప్యూటర్ ల్యాప్ టాప్ పై ప్రత్యక్షమవుతుంది. వచ్చిన ఓటరు సరైన వారేనని పోల్చుకున్న అనంతరం .. ఓటరు వేలి ముద్ర తీసుకుంటారు. అనంతరం ఓటరు వయస్సును దృవపరచుకున్న అనంతరం ...ఓటు వేసేందుకు యంత్రం సిద్దమని సంకేతాలు ఇస్తుంది. బ్యాలెట్ బాక్సు లో నచ్చిన అభ్యర్థికి సంబంధించిన గుర్తుపై ఓటు వేశాక.. ఏ అభ్యర్థికి, గుర్తుకు ఓటు వేశామో వెంనటే పక్కనున్న డిస్ ప్లేలో చూపిస్తుంది. వీవీప్యాట్ తరహాలోనే ప్రింట్ రావడంతో పాటు కొంత సేపు వివరాలన్నీ డిస్ ప్లే అవుతాయి. అక్కడితో ఓటింగ్ పూర్తయినట్లు భావించాలి.

మళ్లీ వస్తే పట్టేస్తుంది

ఒకవేళ ఓ సారి ఓటు వేసిన వ్యక్తి తిరిగి మరో సారి ఓటు వేసేందుకు కేంద్రంలోకి వస్తే ఆధార్ అనుసంధానిత వ్యవస్థ వెంటనే పట్టేస్తుంది. వెంటనే బీప్ శబ్దం చేయడం సహా... ఓటు వేసే అవకాశం ఇవ్వదు. దీనివల్ల దొంగఓట్లకు తావుండదు. ఫింగర్ ప్రింట్ ఆధారంగా ఓటు వేసేందుకు అనుమతి ఇస్తుండటం వల్ల రిగ్గింగ్ కూ అవకాశం ఉండదు. ఈవీఎంల తయారీ కంటే తక్కువ ఖర్చుతోనే అధునాతన ఈవీఎం వ్యవస్థ తయారు చేసినట్లు విద్యార్థినులు చెబుతున్నారు. తక్కువ సమయంలోనే ఓటు వేసే అవకాశం ఉండటం వల్ల పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు గంటల తరబడి నిరీక్షించాల్సిన అవసరం లేదంటున్నారు. దీనివల్ల అందరికీ ఓటు వేసే అవకాశమూ లభిస్తుందని చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details