కళను నమ్ముకున్న రాజస్థాన్ బొమ్మల తయారీ దారుల.. వేల కిలోమీటర్ల ప్రయాణించి 15 ఏళ్ల క్రితం మోపిదేవి గ్రామానికి చేరుకున్నారు. కొనేళ్లుగా సాఫీగా సాగిన వీరి జీవనంలో కొవిడ్ 19 తీవ్రంగా నష్టాన్ని మిగిల్చింది. ప్రభుత్వం కరోనా ఆంక్షలు విధించటంతో.. రెండేళ్లుగా వినాయక ప్రతిమలు ఒక్కటి కూడా అమ్ముడుపోక.. అప్పులు ఎలా తీర్చాలో తెలియక సతమతమవుతున్నారు. ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో విలవిల్లాడుతున్న రాజస్థాన్ బొమ్మల తయారీ దారులపై ప్రత్యేక కథనం..
కృష్ణాజిల్లాలోని మోపిదేవికి కొంతమంది మట్టి కళాకారులు రాజస్థాన్ నుంచి కుటుంబ సమేతంగా వచ్చారు. మోపిదేవి గ్రామంలో స్థలం లక్ష రూపాయలకు అద్దెకు తీసుకుని అందులో షెడ్లు వేసుకుని.. వినాయక విగ్రహాలు తయారు చేస్తూ పొట్ట నింపుకుంటున్నారు. సంవత్సరం పొడవునా కష్టపడి.. సుమారు రెండు వందల విగ్రహాలు తయారు చేస్తారు. వీటి తయారీకి సుమారు 20 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెడతారు. విద్యుత్ ఛార్జీలు, మేటిరియల్ కోసం అప్పులు చేసి మరి బొమ్మలు తయారు చేస్తున్నారు. వీరి పిల్లలను కూడా స్థానిక స్కూళ్లలో చదివిస్తున్నారు.
అడ్వాన్స్ సొమ్ము అయిపోయింది...
మోపిదేవిలో తయారైన బొమ్మలకు మంచి గిరాకీ ఉంటుంది. కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడకు వచ్చి విగ్రహాలు కొనుగోలు చేస్తారు. గత ఏడాది తయారు చేసిన వినాయక విగ్రహాలు అమ్ముడుకాక.. వర్షాలకు గాలులకు షెడ్లు పడిపోయి బొమ్మలు అన్ని తడిచిపోవటం వలన లక్షల రూపాయలు నష్టపోయారు. ఈ సంవత్సరం అయినా ఉన్న విగ్రహాలు అమ్ముడుపొతే అప్పులు తీర్చవచ్చు అనుకునే సమయానికి.. వినాయక విగ్రహాలు బహిరంగ ప్రదేశాల్లో పెట్టరాదని ప్రభుత్వం ఆంక్షలు ఇవ్వటంతో ఏమి చేయాలో తెలియక కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అడ్వాన్స్ ఇచ్చిన వారు తిరిగి ఇవ్వాలంటున్నారని.. ఆ డబ్బులు రంగుల కోసం ఖర్చు చేశామని.. ఏమి చేయాలో తెలియడం లేదని వాపోతున్నారు.