ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Cockfight: మొదలైన సంక్రాంతి సంబరం..తగ్గేదే లే అంటున్న పందెం కోళ్లు

cock fight: పౌరుషానికి ప్రతిరూపాలు పందెంకోళ్లు.. కత్తికట్టి బరిలోకి దించితే.. యజమాని పరువు కోసం.. ప్రాణాలు పణంగా పెట్టి.. కొట్లాడుతుంది. ఇక సంక్రాంతి వచ్చిందంటే చాలు.. తగ్గేదే లే.. అంటూ ప్రత్యర్థిపై విరుచుకుపడేందుకు పందెం కోళ్లు రెఢీ అవుతాయి. అయితే పందెం రాయుళ్లు పుంజుల్ని బరిలోకి దించేటప్పుడు ఓ ప్రత్యేక శాస్త్రాన్ని అధ్యాయనం చేస్తారు. దాన్నే కుక్కుటశాస్త్రం అంటారు. అసలు ఈ కుక్కుటశాస్త్రం ఏం చెబుతుంది. దాని ప్రకారం పందెంకోళ్లు ఎన్ని రకాలు, వాటి తీరుతెన్నులేంటి అనేదాని గురించి తెలుసుకుందాం..

1
Kukkuta sastram

By

Published : Jan 11, 2022, 12:33 PM IST

Updated : Jan 11, 2022, 12:58 PM IST

Cock fight:సంక్రాంతి వచ్చిందంటే ముందుగా గుర్తుకొచ్చేది కోడి పందేలు. తెలుగు సంప్రదాయం, పౌరుషానికి ప్రతీకగా నిలిచే కోడిపందేలను పండుగ జరిగే మూడురోజులు కోలాహలంగా నిర్వహిస్తారు. సంక్రాంతికి 6 నెలల ముందు నుంచే ఈ పందెం కోళ్లను సిద్ధం చేస్తారు. కోళ్లను పందేనికి సిద్ధం చేసే క్రమంలో ఎంతో శ్రమ, కఠిన శిక్షణ ఉంటుంది. బలవర్ధకమైన ఆహారం అందించడంతో పాటు తరచూ పశువైద్యులకు చూపించి వారి సలహాల మేరకు విటమిన్‌ మాత్రలు వేస్తారు. ఒక్కో కోడి పుంజుకు సుమారు 10వేల నుంచి 30వేల వరకు ఖర్చు చేస్తారు.

ఆ రెండు అంశాలే కీలకమైనవి...

కోడి పందెంలో రెండు అంశాలు కీలకమైనవి. ఒకటి కోడి జాతి, రెండు దానికి ఇచ్చే శిక్షణ. కోడి పుంజుల్లో తెల్ల నెమలి, కోడి నెమలి, గౌడ నెమలి, కాకి డేగ, నెమలి కక్కెర, నల్ల కక్కెర, రసంగి, గాజు కుక్కురాయి, అబ్రాస్‌, ఎర్ర డేగ వంటి జాతులు ఉంటాయి. రెక్కల రంగు, ఇతర శారీరక లక్షణాల ఆధారంగా వీటిని వర్గీకరిస్తారు. ముందుగానే వీటిని ఎంపికు చేసుకుని.. ఏడాదిన్నర పాటు శిక్షణ ఇచ్చి పందెం బరిలోకి దింపుతారు.

ఏ దిక్కు నుంచి కోడిని బరిలోకి దించాలి...

కోడిని ఏ దిక్కు నుంచి బరిలోకి దింపితే విజయం సాధిస్తుందనే అంశంలో పందెం రాయుళ్లు కొన్ని విశ్వాసాలను అనుసరిస్తారు. వారాలు, పక్షాలను అనుసరించి.. కొన్ని జాతుల కోడి పుంజుల జీర్ణశక్తి మందగిస్తుందన్న అంచనా కూడా ఉంది. ఆ సమయంలో పందేనికి దింపితే కోడి అపజయం పాలవుతుందని కొందరు నమ్ముతారు.

ఆ జాతి కోళ్లు పోరాట పటిమకు పెట్టింది పేరు...

డేగ జాతి కోళ్లు పోరాట పటిమకు ప్రసిద్ధి. ఇవి చూడముచ్చటగా ఉండటంతో పాటు.. చురుగ్గా కదులుతాయి. సంక్రాంతి వేళ కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో కోడి పందేల సందడే వేరు. నెమలి జాతి కోళ్లు 3 కేజీల వరకు తూగుతాయి. మంచి కండపుష్టి ఉండటంతోపాటు కళ్లు చురుగ్గా ఉంటాయి. కాలి గోళ్లు బలంగా, మొనదేలి ఉంటాయి.

పందెం వేసే రోజున నక్షత్రాన్ని బట్టి ఏ పుంజుతో...

పందెం వేసే రోజున నక్షత్రాన్ని బట్టి తారాబలం చూసి.. కోడి రంగు, జాతిని ఎంపిక చేసి ఆ రోజున ఏ పుంజుతో పందెం వేయాలో.. ఆ రంగు ఉన్న కోడి పుంజుతోనే పందేలు వేస్తారు. 13వ తేదీ భోగి సందర్భంగా గౌడ నెమలి, నెమలికి చెందిన పుంజులు గెలుపొందుతాయని.. 14వ తేదీ యాసర కాకి డేగలు, కాకి నెమళ్లు, పసిమగల్ల కాకులు, కాకి డేగలకు చెందిన పుంజులు గెలుపొందితే... 15వ తేదీన డేగలు, ఎర్రకాకి డేగలు గెలుస్తాయని పందేళ్లో ప్రావీణ్యం ఉన్న వారి నమ్మకం.

తాళపత్ర గ్రంథాలు ఏం చెబుతన్నాయి..

కోడిపందేలు ప్రాచీన సంప్రదాయమనేందుకు తాళపత్ర గ్రంథాలు సాక్ష్యమన్నది పందెం రాయిళ్ల మాట. కోడి పుంజులు, వాటి రకాలు, ఏ రకం పుంజు పోరాట లక్షణం ఏమిటి, ఏ రకం పుంజుపై ఏ రకాన్ని బరి లోదించితే విజయావకాశాలు ఉంటాయనే వివరాలు సైతం ప్రాచీన తాళ పత్ర గ్రంథాల్లో లభిస్తాయని చెబుతారు..

చనిపోయిన కోడి మాంసానికి విపరీతమైన గిరాకీ..

బరిలో ఓడి చనిపోయిన కోడి మాంసానికి విపరీతమైన గిరాకీ ఉంటుంది. వేలం పెట్టి మరీ కొనుగోళ్లు జరిపే సందర్భాలు ఉంటాయి. గ్రామాల్లో పందెం కోళ్లను గుర్తించడం ఓ నైపుణ్యంగా భావిస్తారు. పందెం కోళ్లను గుర్తించడం, వాటిని పోటీలకు సిద్ధం చేయడమే వృత్తిగా జీవిస్తున్నవారు ఎందరో ఉన్నారు.. Spot

బరిలోకి దించేటప్పుడు పాటించాల్సిన నియమాలు..

బరిలోకి దింపే ఈ పందెం కోళ్లలో కొన్ని నియమాలు తప్పనిసరి. రెండు కోళ్ల బరవు ఇంచుమించుగా సమతూకం ఉండాలి. ఉండాల్సిన బరువుకన్నా ఎక్కువ తక్కువలు ఉన్నా.. తేడాలొస్తాయి. పందెం పుంజు ఒంటి గట్టితనం అన్నిటికన్నా ముఖ్యం. అందుకే చల్లనీళ్లని నోటిలోకి తీసుకుని కోడిమీదకు ఊదుతారు. అలా చేస్తే దాని శరీరం గట్టిపడుతుందని ఓ నమ్మకం.

ఆ కోడి గెలిస్తే ప్రపంచాన్ని జయించిన ఆనందం..

బరిలో దిగిన కోడి గెలిస్తే ప్రపంచాన్ని జయించిన ఆనందం... ఓడిపోతే తట్టుకోలేని అవమానాలు ఇక్కడ సర్వసాధారణం. మెడ మీద ఈకలు రెక్కించి పౌరుషం కళ్లల్లో కదలాడే కోడి పుంజు ఒక్క ఉదుటున గాలిలోకి లేచి ప్రత్యర్థిని దెబ్బతీసే దృశ్యం తిలకించే కిక్కే వేరు.

ఇదీ చదవండి:Sankranti Sambaralu: అక్కడ ముందస్తుగా సంక్రాంతి సంబరాలు... ఎందుకో తెలుసా..?

Last Updated : Jan 11, 2022, 12:58 PM IST

ABOUT THE AUTHOR

...view details