భారతదేశ చలన చిత్ర పరిశ్రమలో స్పెషల్ ఎఫెక్ట్స్ నిపుణుడిగా పేరొందిన 'ఏక్నాథ్'... అనారోగ్యంతో చెన్నైలో కన్ను మూశారు. కొన్నిరోజులుగా చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కాన్సర్ వ్యాధికి చికిత్స పొందుతున్న ఆయన.. బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంలో జన్మించిన ఏక్నాథ్.. 50 సంవత్సరాల క్రితం చెన్నై వచ్చారు. స్పెషల్ ఎఫెక్ట్స్ రంగంలో నైపుణ్యం సాధించి.. అనతికాలంలోనే దానిలో అగ్రగణ్యులయ్యారు. జానపద, పౌరాణిక చిత్రాల్లో యుద్ధాలు, మాయ, మంత్ర, తంత్ర సన్నివేశాలు.. సాంఘిక చిత్రాల్లో పాటలు, ఫైట్లకు అవసరమైన హంగులు అద్దారు. భారతీయ భాషలతోపాటు ఆంగ్ల చిత్రాలకు ఆయన పని చేశారు. ఎన్టీఆర్, ఏయన్నార్ వంటి అగ్ర హీరోలతో.. కే. రాఘవేంద్ర రావు, దాసరి నారాయణరావు, మణిరత్నం వంటి దర్శకులతో పనిచేశారు. మొత్తం 700 పైగా చిత్రాలకు స్పెషల్ ఎఫెక్ట్స్ అందించారు. దేశంలో తొలి త్రీడీ చిత్రం 'మైడియర్ కుట్టి సాత్తాన్' (తెలుగులో 'చిన్నారి చేతన') తో సహా భారతీయ భాషల్లో నిర్మించిన అన్ని త్రీడీ చిత్రాలకు పనిచేశారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఏక్నాథ్ అంత్యక్రియలు నేడు చెన్నైలో జరగనున్నాయి.
స్పెషల్ ఎఫెక్ట్స్ నిపుణుడు ఏక్నాథ్ ఇకలేరు - మచిలీపట్నం
ఎన్నో పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలకు తన స్పెషల్ ఎఫెక్ట్స్‌తో హంగులు దిద్దిన నిపుణుడు ఏక్నాథ్.. బుధవారం చెన్నైలో కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు నేడు చెన్నైలో జరగనున్నాయి.
స్పెషల్ ఎఫెక్ట్ నిపుణుడు ఏక్నాథ్ ఇకలేరు...