మూడేళ్లలోనే ప్రాథమిక విద్యారంగంలో అనేక మార్పులు తెచ్చామని, ప్రాథమిక విద్యా విధానం బలంగా ఉంటే భవిష్యత్తులో ఫలితాలు బాగుంటాయన్న ఉద్దేశంతోనే విలీన ప్రక్రియ చేపట్టామని పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ స్పష్టం చేశారు. ఇందుకోసం ఎంతో కసరత్తు చేశామని, భాగస్వామ్య పక్షాలతో చర్చించామని గుర్తుచేశారు. తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించేలా మీడియాలో వార్తలొస్తున్నాయని ఆక్షేపించారు. శిథిల భవనాలు, గదుల కొరత వంటివి ఏళ్ల తరబడి ఉన్న సమస్యలు. వీటిని అధిగమించడానికి అనేక చర్యలు చేపట్టామని వివరించారు.
ఇబ్బందులున్న చోటే అభ్యంతరాలు:3, 4, 5 తరగతులను ఇబ్బందుల్లేని చోట మాత్రమే ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తున్నాం. ఉదాహరణకు విలీనం కారణంగా ఒక ఉన్నత పాఠశాలకు వంద మంది పిల్లలు వస్తున్నారనుకుంటే, వారికి సరిపడా తరగతి గదులు, బెంచీలు ఉన్నాయా? తగినంత మంది సబ్జెక్ట్ టీచర్లున్నారా? అన్నవి పరిశీలించాలని అధికారులకు ఆదేశాలిచ్చాం. ఈ సదుపాయాలు, సిబ్బంది లేనిచోటే అభ్యంతరాలొస్తున్నాయి. అందుకే దశల వారీగా అమలు చేస్తున్నాం. 2021-22 విద్యా సంవత్సరంలో 250 మీటర్లలోపు, 2022-23లో కిలోమీటర్‌లోపు దూరంలోని ఉన్నత పాఠశాలల్లో 3, 4, 5 తరగతులను విలీనం చేశాం. మొదట 3 కి.మీ వరకు అనుకున్నప్పటికీ ఎమ్మెల్యేల సూచనలతో కిమీకు పరిమితం చేశాం. దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రులు అర్థం చేసుకోడానికి సమయం పడుతుంది. గుజరాత్‌లోనూ ఈ ప్రక్రియను ఈ ఏడాదే ప్రారంభించారు. చాలా రాష్ట్రాలు ఈ దిశగా ఆలోచిస్తున్నాయి.