కృష్ణాజిల్లా నందిగామ నగర పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వారం రోజులుగా విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్నారు. అయినప్పటికీ పాలకులు, అధికారులు ఏమాత్రం స్పందించకపోవడంతో కార్మికుల ఆందోళన ఉద్ధృతం చేశారు. సోమవారం నగర పంచాయతీ కార్యాలయం ఎదుట మోకాళ్లపై నిలబడి కార్మికులు ఆందోళన చేశారు. 103 మంది కార్మికులు ప్రతిరోజూ ఏదోరకంగా ఆందోళనలు చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. గత నాలుగు నెలల వేతనాలు చెల్లించాలని, ఆరు నెలల ఆరోగ్య అలవెన్సులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వేతనాలు ఇచ్చేవరకు విధులకు హాజరుకాబోమని స్పష్టం చేశారు.
కార్మికుల ఆందోళనతో నందిగామలో పారిశుద్ధ్య పనులు ఏడు రోజులుగా నిలిచిపోయాయి. దీనివల్ల పట్టణంలో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోతుంది. చెత్త కుండీలు చెక్కతో నిండిపోయాయి. రోడ్ల పక్కనే చెత్త పోస్తున్నారు. వీటి వద్ద ఈగలు, దోమలు, పందులుతో మరింత అధ్వాన్నంగా మారింది. వ్యాధులు ప్రబలే పరిస్థితి నెలకొంది.