పట్టించుకునే నాథుడు కరవు
అక్రమార్కుల అండతో.. యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
కైకలూరు మండలంలోని శివారు గ్రామాల్లో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతోంది.. నిబంధనలకు పాతరేసి తవ్వేస్తున్నారు. అనుమతుల్లేకుండానే పశ్చిమగోదావరి జిల్లాకు తరలిపోతోంది. ప్రభుత్వాదాయానికి భారీగా గండిపడుతోంది.
ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ ఆదాయానికి భారీ ఎత్తున గండికొడుతున్నారు. చదరపు గజానికి అడుగులోతున తవ్వేందుకు రూ.9 వంతున చెల్లించి మైనింగ్, రెవెన్యూ అధికారుల నుంచి అనుమతి పొందాలి. క్షేత్రస్థాయిలో పరిశీలన తర్వాతే అనుమతులు మంజూరవుతాయి. మట్టిని లారీల్లో తరలించేందుకు ప్రత్యేక అనుమతులు ఉండాలి. ఇవేమి లేకుండానే అధికారులకు ముడుపులు ముట్టజెబుతూ మట్టి తరలిపోతోంది. వందల ఎకరాల్లో తవ్వకాలు జరుగుతున్నా పట్టించుకున్న నాథుడు లేడు. అక్రమ రవాణాలో ప్రమాదాలు జరుగుతున్నా ప్రశ్నించేవారు లేరు. అక్టోబరు నుంచి దందా సాగుతున్నా అధికారులు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. ముందుగానే ముడుపులు ముడుతున్నాయనే ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. జిల్లా కలెక్టర్ స్పందించి మట్టిమాఫియా ఆగడాలు అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.