విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈనెల 22 నుంచి 24 వరకు శాకంబరీ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవ నిర్వహణపై ఆలయ పాలక మండలి చైర్మన్ పైలా సోమినాయుడు సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా భక్తులు ఉత్సవాలు తిలకించేందుకు అనుమతించాలని నిర్ణయించారు. భక్తుల నుంచి కాయగూరలు విరాళంగా స్వీకరించాలని నిర్ణయించారు. భక్తుల నుంచి రాని కాయగూరలు కొనుగోలు చేయాలని ఛైర్మన్ సూచించారు.
శాకాంబరీ దేవి ఉత్సవ ఆహ్వాన పత్రికను పాలకమండలి చైర్మన్ సోమినాయుడు ఆవిష్కరించారు. ఆలయ ప్రధానార్చకులు మల్లేశ్వర శాస్త్రి, ఉప ప్రధాన అర్చకులు శంకర శాండీల్య , పాలకమండలి సభ్యులు ఎన్. సుజాత సహాయ కార్యనిర్వహణాధికారి రవీంద్ర ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆషాడ మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి పవిత్ర సారె సమర్పణ సందడిగా సాగుతోంది.