Sajjala On PRC GOs: పీఆర్సీ జీవోలు, ఉద్యోగుల ఆందోళనపై ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు పడుతున్నప్పుడు.. పాత జీతాలివ్వడం, జీవోలు వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదని అన్నారు. సచివాలయంలో మంగళవారం పీఆర్సీ సాధన సమితి సభ్యులతో సమావేశం అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘పీఆర్సీ నివేదిక ఎందుకు అడుగుతున్నామో వారు కొన్ని కారణాలు చెప్పారు. చర్చించి చెబుతామన్నాం. అయినా పీఆర్సీ నివేదికపై ఎందుకంత పట్టుదల? అది ఇస్తే సమస్యలు పరిష్కారమైనట్లేనా? తెలంగాణలో కూడా తొలుత రిపోర్ట్ ఇవ్వలేదు. తరువాత ప్రభుత్వం వెబ్‌సైట్‌లో పెట్టిందని విన్నాం’ అని సజ్జల వ్యాఖ్యానించారు. ‘చర్చలతో సమస్యలు పరిష్కరించుకునే ప్రక్రియ ఆలస్యంగానైనా మొదలైనందున ప్రత్యక్ష ఉద్యమాలు వాయిదా వేసుకోవాలని కోరాం. ఇప్పటికే నిర్ణయం తీసుకున్నందున ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పారు.
Sajjala On PRC: కొత్త జీతాలు ఖాతాల్లో వేస్తున్నాం... పాత జీతాలివ్వడం అసాధ్యం: సజ్జల
15:27 February 01
ఉద్యమ కార్యాచరణ వాయిదా వేసుకోవాలని ఉద్యోగ సంఘాలను కోరాం: సజ్జల
నాయకులను బెదిరిస్తున్నామనడం అవాస్తవం...
హైకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకొని కార్యాచరణను వాయిదా వేసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. కొవిడ్‌ను దృష్టిలో పెట్టుకొని చలో విజయవాడ కార్యక్రమం గురించి ఆలోచించాలన్నామని సజ్జల తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకోబోదన్నారు. చర్చలతో ఉద్యోగుల సమస్యలు పరిష్కారమవుతాయని ఆశిస్తున్నామన్నారు. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతకుమించి ఉద్యోగులకు చేయలేకపోవడమే తప్ప.. కావాలని కొంతమందికి ఆర్థిక ప్రయోజనాలు తగ్గించి అన్యాయం చేయాలన్న ఉద్దేశమేమీ లేదు. చర్చలతో అటు, ఇటు మారడమంటూ ఉండదు. సవరణలు చేసుకునే అవకాశం ఉంటుంది. జీతాలు నిర్ణయించే వరకు ఇస్తున్నదే మధ్యంతర భృతి (ఐఆర్). జీతాలు ఇచ్చినపుడు దానికీ, దానికీ సర్దుబాటు అంతే. ఏదైనా చెల్లించి వెనక్కి తీసుకుంటే అది రికవరీ అవుతుంది. అంతేగానీ ఇప్పుడు రికవరీ అనే ప్రశ్న తలెత్తదు’ అని స్పష్టం చేశారు. చర్చల సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులను బెదిరిస్తున్నామనడం అవాస్తవమన్న సజ్జల.. మీకు అలా ఎవరు చెప్పారని విలేకర్లను ప్రశ్నించారు.
"చర్చలు ప్రారంభమయ్యాయి.. ఇంకా ముందుకెళ్తాం. ఉద్యోగుల జీతాల నుంచి రికవరీలు అనేవి ఏమీ లేవు. ఉద్యోగ సంఘాల నేతలు 3 డిమాండ్లను మా ముందుంచారు. పీఆర్సీ జీవోలు రద్దు చేయడం భావ్యం కాదని చెప్పాం. కొత్త జీవో ప్రకారం ఇప్పటికే కొత్త వేతనాలు వేశాం. మేం ఓపెన్ మైండ్‌తోనే చర్చిస్తున్నాం. ఒత్తిడి తెచ్చి ఏదో సాధించాలని ప్రయత్నించడం సరికాదు. హైకోర్టు కూడా అదే వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. ఉద్యోగులను ఎవరూ బెదిరించడం లేదు. పీఆర్సీ నివేదికపై అంత పట్టుదల ఎందుకు? పీఆర్సీ నివేదిక ఇస్తే సమస్య పరిష్కారం అయినట్లా. పీఆర్సీ నివేదికను తెలంగాణ కూడా ఇవ్వలేదు. పీఆర్సీ నివేదికను తెలంగాణ తర్వాత వెబ్‌సైట్‌లో పెట్టింది. అసలు విషయాలు వదిలి పీఆర్సీ నివేదికనే ఎందుకు కోరుతున్నారు.?" - సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు
ఇదీ చదవండి