RGV On Movie Tickets: సినిమా టికెట్ల వ్యవహారంపై దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మరోసారి వరుస ట్వీట్లు చేశారు. ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఏకంగా గంటలో 24 ట్వీట్లు చేయడం ఆసక్తిగా మారింది. సోమవారం మంత్రి పేర్నినానితో భేటీ అయిన ఆయన.. చర్చల పట్ల సంతృప్తి వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. తాజాగా ట్వీట్లలో అందుకు భిన్నంగా స్పందించారు.
ఆర్జీవీ ట్వీట్ల సారాంశం...!
- సినిమాల టికెట్ల ధరలకు విధించినట్లే రాష్ట్రంలో ఇంకేదైనా ఉత్పత్తిపై ప్రభుత్వం నిబంధనలు విధించిందా?ఒక వేళ విధించి ఉంటే ఆ ఉత్పత్తుల పేర్లు, అందుకు కారణాలు తెలపాలి.
- రూ.500 కోట్లతో తీసిన ‘ఆర్ఆర్‌ఆర్’ రూ.కోటి తీసిన చిత్రంతో ఎలా పోలుస్తాం. చిన్న చిత్రాలతో సమానంగా భారీ చిత్రాల టికెట్ ధర ఎలా నిర్ణయిస్తాం.
- సినిమా నిర్మాణ వ్యయంతో తమకు సంబంధం లేదని ప్రభుత్వం వాదించాలనుకుంటే అదే వాదన ప్రపంచంలో ఎక్కడ తయారైన వస్తువుకైనా వర్తిస్తుందా?
- పోటీ ఆధారంగానే వస్తువుల నాణ్యత, ధర నిర్ణయిస్తారు. బాహ్య శక్తుల ఆధారంగా కంపెనీలు ధరలు నిర్ణయించవు.
- తక్కువ ధరలకు అమ్మాలని ప్రభుత్వం బలవంతం చేస్తే, అసలు ఉత్పత్తే ఆగిపోవచ్చు. అప్పుడు నాసిరకం ఉత్పత్తులు బయటకు వస్తాయి.
- ఒక రాష్ట్రంలో సినిమా టికెట్ రూ.2,200లకు విక్రయిస్తుంటే, అదే సినిమా టికెట్ ఏపీలో రూ.200లకు ఎలా విక్రయిస్తారు. ఆర్టికల్14 ప్రకారం అది నిబంధనలు ఉల్లంఘించడం కాదా?
- టికెట్ల ధరలు, సమయాలు, ప్రదర్శన విషయంలో ప్రభుత్వ జోక్యం తగదు. ఇతర వస్తువుల ధరల విషయంలో లేని ప్రభుత్వ జోక్యం టికెట్లపై ఎందుకు?
- రాత్రీ, పగలు థియేటర్‌లలో సినిమాలు ప్రదర్శిస్తే, వచ్చే ప్రమాదం ఏంటి? కొవిడ్ కన్నా ముందు మహారాష్ట్రలో 24/7సినిమాలు ప్రదర్శించుకోవడానికి అనుమతులు ఇచ్చింది.
- వినియోగదారుడి సమయానుకూలత, పని వేళలు బట్టి సినిమా ప్రదర్శనలు వేయవచ్చు కదా! వాళ్లకు ఉన్న వెసులుబాటు బట్టి అర్ధరాత్రి సైతం సినిమా చూసేలా అవకాశం ఎందుకు ఇవ్వకూడదు?
- బెనిఫిట్ షోలకు టికెట్ ధరలు అధికంగా ఉన్నా, ప్రజలు కొనుగోలు చేసే శక్తి ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఆదాయం సమకూరదా?
- ఒక నటుడికి నిర్మాత ఎంత పారితోషికం చెల్లిస్తున్నారనే విషయంలో ప్రభుత్వానికి ఉన్న సమస్య ఏంటి?
- పవన్‌కల్యాణ్‌తో సహా ఇతర స్టార్స్‌కు ఎందుకంత పారితోషికం ఇస్తున్నారంటే, ఒక వేళ మనం ఐఫోన్ బద్దలు కొడితే అందులో వాడిన మెటీరియల్‌కు అయిన మొత్తాన్ని లెక్కకడితే రూ.1000 కూడా కాదు. కానీ, రూ.2లక్షలు పెట్టి మనం ఆ ఫోన్ కొనుగోలు చేస్తున్నాం. ఎందుకంటే ఫోన్ తయారు చేసిన ఆలోచనకు అంత చెల్లిస్తున్నాం. బ్రాండ్, మార్కెట్ అలా డిమాండ్ చేస్తుంది.
- 70ఏళ్లుగా అమలు చేస్తున్న సినిమాటోగ్రఫీ చట్టం 1955ను ఏపీ ప్రభుత్వం తీసి అవతల పారేసింది. దీనిపై కోర్టులో సవాల్ చేయాలి.
- ఈ విపత్కర పరిస్థితుల్లో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ అమలు సబబే. కానీ, సినిమాటోగ్రఫీ యాక్ట్‌ను అమలు చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది?
- ఒకవేళ ప్రజలపై ప్రభుత్వానికి మమకారం ఉంటే, ఎవరైతే సినిమా టికెట్‌ను అధిక ధర వెచ్చించి కొనుగోలు చేయలేరో వారికి సంక్షేమ పథకం కింద ప్రభుత్వమే రాయితీ కల్పించి విక్రయించవచ్చు కదా!
- నేను చివరిగా చెప్పేది ఒక్కటే టికెట్ రేట్లు, థియేటర్‌లలో షోలు వదిలేసి, భద్రత, పన్నులపై ప్రభుత్వం దృష్టి పెడితే బాగుంటుంది. అంటూ వర్మ వరుస ట్వీట్లు చేశారు.
'హూ కిల్డ్ కట్టప్ప'..?
ram gopal varmatweets:మహారాష్ట్రలో 'ఆర్‌ఆర్‌ఆర్' టికెట్ ధర రూ.2,200గా ఉందన్న వర్మ.. రాజమౌళి సొంత రాష్ట్రమైన ఏపీలో రూ.200కు కూడా అనుమతించని దుస్థితి ఉందని ఆక్షేపించారు.'హూ కిల్డ్ కట్టప్ప'..? అంటూ తనదైన శైలిలో సెటైర్ విసిరారు. వేర్వేరు టికెట్ ధరల నిర్ణయం ఆర్టికల్ 14 ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు. రాత్రీపగలు ప్రదర్శనలకు అనుమతిస్తే నష్టమేంటని ప్రశ్నించారు. కొవిడ్ రాకముందు మహారాష్ట్రలో 24 గంటలూ షోలు నడిచాయని తెలిపారు.