RBK staff and Millers Committed Fraud : ఈ ఏడాది కాకపోతే మరో ఏడాదైనా మంచి దిగుబడి రాకపోతుందా అనే ఆశతో.. అప్పులు చేసి మరీ రైతులు సాగు చేస్తుంటారు. ఎండనక-వాననక, పగలనక-రేయనక శ్రమిస్తుంటారు. అలాంటి కర్షకుల్ని ఆదుకోవాల్సిన రైతుభరోసా కేంద్రం అధికారులే.. మిల్లర్లతో కలిసి రైతును దగా చేస్తున్న వ్యవహారం కృష్ణా జిల్లాలో వెలుగులోకి వచ్చింది. తోట్లవల్లూరు మండలం గరికపర్రులో ధాన్యం నాణ్యతను సాకుగా చూపి అవినీతికి తెర తీశారు. మధుసూదనరావు అనే రైతు వద్ద తీసుకున్న ధాన్యాన్ని బస్తాకు 1530 రూపాయల చొప్పున అమ్మేసి అందులో 400 రూపాయల చొప్పున కొట్టేయడానికి యత్నించారు.
ఆర్బీకే అధికారుల సూచన మేరకు ఈ నెల 6న ఉయ్యూరు శ్రీ రాధాకృష్ణా రైస్ మిల్లుకి మధుసూదనరావు 138 బస్తాల ధాన్యాన్ని తీసుకెళ్లారు. పాయ వచ్చిందంటూ బస్తాకు 1100 ఇస్తామని చెప్పడంతో, 1300 రూపాయలు అనుకుని రైతు సరే అన్నారు. ఆ తర్వాత ఆర్బీకేకి వెళ్లిన మధుసూదనరావుకు.. 30 వేల రూపాయలు ఎదురు చెల్లిస్తేనే 11 వందల రూపాయల చొప్పున ధాన్యం డబ్బు ఖాతాలో పడుతుందని అధికారులు చెప్పడంతో ఆయన అవాక్కయ్యారు. నేనెందుకు డబ్బులు కట్టాలంటూ అధికారుల్ని నిలదీశారు.
"నేను మిల్లుకు శాంపిల్ పంపించాను. మిల్లులో ధాన్యానికి ధర 1100 రూపాయలు చెల్లిస్తామని ఓ స్లిప్‌లో రాసి, దానిని రైతు భరోసా కేంద్రం వద్ద ఇవ్వమన్నారు. నేను 1300 రూపాయల ధర కట్టిస్తున్నారు అనుకుని మిల్లుకు ధాన్యాన్ని పంపించాను. మిల్లులో 1100 రూపాయలే చెల్లిస్తామని అన్నారు. కానీ, రైతు భరోసా కేంద్రానికి మాత్రం 1530 ధర చెల్లించినట్లు పంపించారు. నాతో 30వేల రూపాయలు చెల్లించమని మిల్లులో అడిగారు. నేను ఇవ్వనని అన్నాను. డబ్బులు చెల్లిస్తే మొత్తం ధాన్యం డబ్బులు వస్తాయని అన్నారు. రైతు భరోసా కేంద్రం అధికారులు, మిల్లు వాళ్లు నన్ను పిలిచి తప్పైపోయిందని.. నా డబ్బులు నాకు ఇస్తామని అన్నారు."-మధుసూదనరావు, రైతు