25 వారాలకే పుట్టిన శిశువుకు.. అరుదైన శస్త్ర చికత్స - hospital
ఎంతో క్లిష్టమైన శస్త్ర చికిత్సను ఆంధ్ర ఆసుపత్రి వైద్య బృందం విజయవంతంగా పూర్తి చేసింది. నెలలు నిండకుండానే పుట్టిన పాపకు గుండె ఆపరేషన్ చేసి ప్రాణాలు నిలిపారు.
నెలలు నిండకుండానే 25 వారాలకు పుట్టిన నవజాత శిశువుకు విజయవాడలోని ఆంధ్ర ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా గుండె శస్త్రచికిత్స నిర్వహించారు. విజయవాడకు చెందిన అంబిక, ప్రసాద్ దంపతులకు జనవరి 18వ తేదీన జన్మించిన నవజాత శిశువుకి... పుట్టుకతోనే గుండె జబ్బు ఉన్నట్లుగా ఆంధ్ర ఆసుపత్రి పిల్లల వైద్యులు గుర్తించారు. శిశువు అస్వస్థతను పేటెంట్ డక్టస్ ఆర్టియోసెస్‌గా వైద్యులు గుర్తించారు. ఈ శిశువు ఊపిరితిత్తులు సరిగా ఎదగకపోవడం వల్ల వెంటిలేటర్ మీద ఉంచారు. 25 వారాలకే పుట్టిన ఈ బేబీకి చికిత్స చేయడం కష్టమైనా... తల్లిదండ్రుల కోరిక మీదట పుట్టిన కొన్ని రోజులకే శిశువుకు డాక్టరు దిలీప్, డాక్టరు విక్రం, డాక్టరు పి.వి.రామారావు వైద్య బృందం ఈ చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఆపరేషన్ అనంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న శిశువును నేడు డిశ్చార్జ్ చేశారు. ఇప్పుడు శిశువు వయసు మూడు నెలలు. బరువు కిలో 800 గ్రాములుగా ఉందని ఆసుపత్రి వైద్య బృందం మీడియాకు తెలిపింది.
.