ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

houses in R5 zone: "ఆర్ 5 జోన్​లో ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఉందా..?" ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు - Bhumi Puja The capital is Amaravati

Construction houses in R5 zone: అమరావతి పరిధిలోని ఆర్ 5 జోన్​లో ఇళ్ల నిర్మాణానికి వ్యతిరేకంగా రాజధాని రైతులు హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ప్లాట్ల కేటాయింపు తుది ఉత్తర్వులకు లోబడే ఉండాలని సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో స్పష్టంగా చెప్పిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇళ్లు కట్టేందుకు సుప్రీం కోర్టు అనుమతించిందా? అని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించగా.. తనకు సమయం ఇవ్వాలని కోరారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Jul 5, 2023, 8:42 PM IST

Construction houses in R5 zone: రాజధాని పరిధిలోని ఆర్ 5జోన్​లో ఇళ్ల నిర్మాణానికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చిందా అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆర్ 5 జోన్లో ఇళ్ల నిర్మాణం కోసం ఈనెల 8న వైఎస్సార్ జయంతి రోజున భూమి పూజ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఆర్ 5 జోన్ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. అక్కడ ప్లాట్ల కేటాయింపు తుది ఉత్తర్వులకు లోబడే ఉండాలని సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో స్పష్టంగా చెప్పింది. అయినా అక్కడ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ముందుకెళ్లటంపై రాజధాని రైతులు హైకోర్టులో పిటిషన్ వేశారు. అమరావతి రైతుల తరఫున సీనియర్ న్యాయవాదిఉన్నం మురళీధర్ కోర్టులో వాదనలు వినిపించారు. సుప్రీం కోర్టు పట్టాలు ఇచ్చేందుకే అనుమతించిందని.. తుది తీర్పు అందుకు భిన్నంగా వస్తే పరిస్థితి ఏమిటని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. ఇళ్లు కట్టేందుకు సుప్రీం కోర్టు అనుమతించిందా? అని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. అలాంటి ఉత్తర్వులు ఏమైనా ఉంటే కోర్టు ముందుంచాలని సూచించింది. నిర్మాణాలు మొదలు పెట్టే విషయమై కోర్టుకు చెప్పేందుకు తనకు మంగళవారం వరకు సమయం ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. మరి ఈలోపు ఇళ్ల నిర్మాణాలు చేపడితే ఎలా? అని న్యాయవాది మురళీధర్ ప్రశ్నించారు. అలా జరగదని చెప్పిన హైకోర్టు.. కేసు విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఈలోగా ఆర్ 5 జోన్లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన వివరాల్ని అందించాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. అలాగే ఈ విషయంలో కౌంటర్ దాఖలు చేయాలని పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మికి వ్యక్తిగతంగా నోటీసులు జారీచేసింది.

పూర్వాపరాలు, న్యాయపరమైన చిక్కుల్ని పట్టించుకోకుండా.. రాజధాని అమరావతిలోని ఆర్‌-5 జోన్‌లో 47 వేల ఇళ్ల మంజూరుకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. హైకోర్టు తుది తీర్పు... రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వస్తే దాదాపు రూ.700 కోట్లు వృథా అయ్యే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. జూన్ 26న జరిగిన సెంట్రల్‌ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం.. అమరావతిలో 47 వేల ఇళ్ల నిర్మాణానికి అనుమతులిస్తూ... మెుదటి విడతగా వీటిని మంజూరు చేసినట్లు తెలిపింది. ఇళ్ల పట్టాల పంపిణీ హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటుందని, ప్రజా ప్రయోజనాలు కోరే హక్కు లబ్ధిదారులకు ఉండబోదని సుప్రీంకోర్టు స్పష్టం చేసినా కేంద్రం ఏ మాత్రం పట్టించుకోలేదు. నెల రోజుల వ్యవధిలోనే మొత్తం వ్యవహారం పూర్తి కావడం విశేషం

రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో రాజధానేతరులకు 50,793 ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. వీరిలో 47 వేల మందికి కేంద్ర ప్రభుత్వం తొలి విడతగా ఇళ్లు మంజూరు చేసింది. పట్టణ పరిధి ప్రాతిపదికన ఇళ్లు మంజూరు కాగా, ఒక్కో ఇంటి నిర్మాణానికి కేంద్రం రూ.లక్షన్నర, రాష్ట్ర ప్రభుత్వం 30వేలు అందించనున్నాయి. కేంద్రం ఇచ్చే లక్షా 50వేలు పరిగణనలోకి తీసుకున్నా 47 వేల ఇళ్ల నిర్మాణానికి రూ.705 కోట్ల వ్యయం కానుంది. కాగా, భవిష్యత్‌లో హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే పరిస్థితి ఏమిటో కేంద్రం ఆలోచించలేదు.

మరోవైపు అమరావతిలో ఈ నెల 8న ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించేందుకు.. జగన్ సర్కార్ అడుగులు వేస్తోంది. ఇళ్ల నిర్మాణంలో సింహభాగం ప్రభుత్వమే కట్టించి ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. నిర్మాణం వేగంగా జరిగేందుకు షియర్‌వాల్‌ సాంకేతికతను వినియోగించనున్నట్లు తెలుస్తుండగా.. అందుకనుగుణంగా ఇప్పటికే నలుగురు కాంట్రాక్టర్లు సిద్ధమైనట్లు సమాచారం. రాష్ట్రంలో పేదలకు కేటాయించిన 46 వేల ఇళ్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం రద్దు చేయగా.. అందులో నంద్యాల జిల్లా నుంచి 8,959, వైఎస్సార్ జిల్లాలో 8,126 మంది లబ్ధిదారులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 148 ప్రాజెక్టుల నుంచి 46,928 ఇళ్లు రద్దయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details