విదేశాల్లో ఉన్న భారతీయుల్ని స్వస్థలాలకు రప్పించేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోంది. ఈ కారణంగా విదేశాల నుంచి వచ్చే విమాన ప్రయాణికులు కచ్చితంగా 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
వచ్చే 3 రోజుల్లో విదేశాల నుంచి సుమారు 30 వేల మంది ప్రయాణికులు రాష్ట్రానికి రావొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రయాణికులు విశాఖ, తిరుపతి, విజయవాడ విమానాశ్రయాలకు చేరుకోనున్నారు. అధికారులు ప్రత్యేక సమీక్షలు నిర్వహించారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో కృష్ణా జిల్లా కలెక్టరు ఇంతియాజ్ అహ్మద్, గన్నవరం విమానాశ్రయ డైరెక్టర్ జి.మధుసూధనరావు, సంయుక్త కలెక్టర్ డాక్టరు కె.మాధవీలత, హోటల్ అసోయేషన్ ప్రతినిధులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రానికి రానున్న విదేశీ ప్రయాణికుల్లో సుమారు 15 వేల నుంచి 20 వేల మంది గన్నవరం విమానాశ్రయానికి రావొచ్చని అంచనా వేస్తున్నట్లు కలెక్టరు తెలిపారు. గన్నవరం చేరుకునే వారిలో కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల ప్రయాణికులు ఉంటారని.. వీరికి నియమాల ప్రకారం.. థర్మల్ స్కానింగ్‌తోపాటు కోవిడ్-19 స్క్రీనింగ్ చేయాలని చెప్పారు. థర్మల్ స్క్రీనింగ్‌లో పాజిటివ్ వస్తే కోవిడ్ ఆసుపత్రికి తరలించాలని సూచించారు.