ఇంధన ధరలు పెరిగిపోయాయి. బండిలో పెట్రోలు పోయించుకోవాలంటే సామాన్య ప్రజలు భయపడుతున్నారు. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి ఆదాయం తగ్గిన సమయంలో ఈ ధరల పెంపు మరింత భారంగా మారుతుందని వాపోతున్నారు. ఖరీఫ్ రోజుల్లో సాగు ఖర్చులూ పెరుగుతాయని రైతులు వాపోతున్నారు. పెట్రోలు, డీజిల్ ధరలు ఈ నెల 7 నుంచి పెరుగుతూనే ఉన్నాయి. సగటున రోజుకు 50 పైసల నుంచి 65 పైసల వరకూ పెరిగాయి.
వాహన యజమానులకు అదనపు ఖర్చు
రాష్ట్రంలో నెలకు 3 లక్షల కిలోలీటర్ల డీజిల్, 1.20 లక్షల కిలోలీటర్ల పెట్రోలు విక్రయిస్తున్నారు. పెరిగిన ధరల ప్రకారం చూస్తే డీజిల్ వినియోగదారులపై నెలకు రూ.147.60 కోట్లు, పెట్రోలు వినియోగదారులపై రూ.60.36 కోట్ల చొప్పున మొత్తంగా రూ.217 కోట్ల భారం పడుతోంది. డీజిల్ ధరల పెరుగుదల వల్ల వాహన యజమానులు ఒక్కో కిలోమీటరుకు సగటున రూ.1.25 అదనంగా వెచ్చించాలి. ఓ లారీ వెయ్యి కి.మీ. వెళ్లి రావాలంటే రూ.2,500 వరకు అదనంగా ఖర్చవుతోంది. దీనికి అనుగుణంగా రవాణా ఛార్జీలు పెంచడమో.. లేదంటే సరకు రవాణా నిలిపేయడమో చేయాల్సిందేనని లారీల యజమానులు పేర్కొంటున్నారు.
రైతుకు రూ.490 కోట్ల మోత