పెనుగంచి ప్రోలు స్కూలండి... చేరేందుకు క్యూ కడతారండి..! - zphs school
కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా... ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను సైతం తన వైపు తిప్పుకుంటోంది... పెనుగంచి ప్రోలు సర్కారీ బడి. సకల సౌకర్యాలతో... ఆధునిక విద్యతో విద్యార్థులు తల్లిదండ్రులను అడ్మిషన్ల కోసం బారులు తీరేలా చేస్తోంది.
కృష్ణా జిల్లా పెనగంచిప్రోలు మండల కేంద్రంలోని ప్రభుత్వ జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ప్రతీ ఏడాది పెరుగుతూనే వస్తోంది. పాఠశాలలో పెరుగుతున్న మౌలిక సదుపాయాలు, ఇతర సౌకర్యాలతో పాటుగా.. ప్రభుత్వం కొత్తగా అమలుచేయనున్న అమ్మఒడి కార్యక్రమం సైతం ఒక కారణంగా తెలుస్తోంది.
కార్పొరేట్ కు దీటుగా....
పెనుగంచి ప్రోలు జెడ్పీ ఉన్నత పాఠశాలలో గడిచిన రెండేళ్లుగా దాతల సాయంతో అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. విద్యార్థులకు డిజిటల్ తరగతుల ద్వారా బోధన, ప్రత్యేకమైన గ్రంథాలయం, ఆటలకు అనుకూలమైన క్రీడా ప్రాంగణం... ప్రహరీ వంటి సౌకర్యాలతో ప్రైవేట్ స్కూల్లకు దీటుగా ఉండటం వల్ల విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతూనే ఉంది.
బారులు తీరుతున్న తల్లిదండ్రులు...
నిష్ణాతులైన ఉపాధ్యాయులు అకుంఠిత దీక్షతో విద్యార్థులకు చదువులు చెప్పటం, ఫలితాలు ఆశాజనకంగా ఉన్న కారణంగా తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలలో చేర్పించేందుకు పాఠశాల వద్ద బారులు తీరుతున్నారు. మూడేళ్లుగా పదో తరగతి ఫలితాల్లో మండలంలోనే మొదటి స్థానంలో నిలవటం పెనుగంచి ప్రోలు సర్కారు బడి ప్రత్యేకత.