ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దేహీ అంటే కుదరదు.. పోరాడి సాధించుకోవాల్సిందే: పవన్​కల్యాణ్​ - ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు

Pawan Kalyan speech about SC ST sub plan : మన హక్కులను కాలరాసే ఎవరినైనా ఎదుర్కోవాల్సిందేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ యువతకు పిలుపునిచ్చారు. జనాభాకు తగ్గట్టుగా బడ్జెట్‌ కేటాయింపులు జరగాలి.. దేహీ అంటే కుదరదు... పోరాటం చేసే తీసుకోవాలని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు దారి మళ్లించకూడదని, సబ్‌ప్లాన్‌ సంపూర్ణంగా అమలు జరగాలని డిమాండ్ చేశారు. దాదాపు 22 శాతం జనాభా ఉన్నా.. ఇంకా నిధులు ఇవ్వాలని కోరాలా..? అని ప్రశ్నించారు. సామాజిక పునర్నిర్మాణం చేయాలన్నదే తన తపన అని జనసేనాని స్పష్టం చేశారు. మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలులో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు.

janasena meeting
జనసేన సమావేశం

By

Published : Jan 25, 2023, 7:08 PM IST

Updated : Jan 26, 2023, 7:06 AM IST

Pawan Kalyan speech about SC ST sub plan : జనసేన అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధుల కేటాయింపు, వినియోగంలో లోపాలను సరిదిద్ది వారి అభ్యున్నతికి, సంక్షేమానికే ఖర్చు పెడతామని.. ఇందుకోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్సు ఏర్పాటు చేస్తామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. జగన్‌ ప్రభుత్వం నిలిపివేసిన 27 పథకాలను పునరుద్ధరిస్తామని చెప్పారు. ‘ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధుల వినియోగంలో జగన్‌ సర్కారు నిర్లక్ష్యం’ అన్న అంశంపై గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో బుధవారం చర్చా వేదిక నిర్వహించారు.

విశ్రాంత ఐఏఎస్‌ అధికారి వరప్రసాద్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏ పార్టీకీ¨ చెందని అనేక మంది దళిత నాయకులు, మేధావులు పాల్గొని మాట్లాడారు. చర్చావేదికను ముగిస్తూ పవన్‌ కల్యాణ్‌ ప్రసంగించారు. ‘జనసేన ఎవరితో పొత్తులో ఉన్నా కచ్చితంగా చెప్పింది చేస్తాను. చేయకపోతే నన్ను నిలదీయండి. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఎవరైనా సమాధానం చెప్పను అనకూడదు. అంబేడ్కర్‌పై గౌరవం లేని వ్యక్తులే అలా మాట్లాడతారు. బహిరంగంగా మేం బీజేపీతో పొత్తులో ఉన్నామనగానే దూరమైపోతాం అంటారు కొందరు. కేంద్రంతో సన్నిహిత సంబంధాలు లేకుంటే రాష్ట్రానికి సంబంధించి ఏ పనీ కాదన్న ఎంజీఆర్‌ మాటల నుంచి నేర్చుకున్నాను. బీజేపీతో ఉందని జనసేన మీకు విరోధం కాకూడదు. అందరితో గొడవలు పెట్టుకుంటూ ముందుకెళ్లలేం’ అని అన్నారు. జగన్‌ ప్రభుత్వంలో దళిత మహిళను హోం మంత్రిని చేసి ఆమె చేతులు కట్టేశారని.. అన్ని పనులూ సకలశాఖల మంత్రితోనే చేయించారని విమర్శించారు.

అధికారం గురించి ఆలోచించకపోతే ఎదగలేం:‘జగన్‌రెడ్డి జైలుకెళ్తే మీరు ఆయన కోసం ప్రార్థనలు, ఉపవాసదీక్షలు చేశారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీలపై కేసులు పెట్టిస్తున్నాడు. మనం విదేశీ విద్య నిధులు ఎందుకు రాలేదు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు ఎందుకు రాలేదని ఆలోచిస్తున్నామే తప్ప అధికారానికి చేరువ కావాలని ఆలోచించడం లేదు. అలా ఆలోచించనంత కాలం మన పరిస్థితుల్లో మార్పు రాదు. మన హక్కుల్ని కాలరాసే ఎవరినైనా ఎదుర్కోవాల్సిందే. జనాభాలో 22 శాతం మంది ఎస్సీ, ఎస్టీలున్నా ఇప్పటికీ నిధుల కోసం దేహీ అనాల్సిన పరిస్థితి ఉంది. అణగారిన వర్గాలు ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలి’ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో అనేక మంది ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలున్నా, ఉపప్రణాళిక నిధుల మళ్లింపుపై ఒక్కరూ మాట్లాడటం లేదని పవన్‌ విమర్శించారు.

అణగారిన వర్గాన్నే జగన్‌ శాసిస్తారు:ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఓ ఐఆర్‌ఎస్‌ అధికారి ఇంట్లో వివాహానికి నన్ను ఆహ్వానించారు. మీ ఇంట్లోనే వైకాపా వ్యక్తులు ఉన్నారు.. నేనొస్తే మీకు ఇబ్బంది అని చెప్పాను. ఆయన కాదూ కూడదు రమ్మన్నారు. మరో అరగంటలో పెళ్లికి బయలుదేరాల్సి ఉండగా ఆహ్వానించిన వారు ఫోన్‌ చేశారు. మీరు పెళ్లికి వస్తే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రాలేనంటున్నారని చెప్పడంతో ఆగిపోయాను. అనేక మంది పారిశ్రామికవేత్తల ఇళ్లల్లో పెళ్లికి జగన్‌, నేనూ ఇద్దరం వెళ్లాం. అక్కడ రాని ఇబ్బంది ఇక్కడ ఎందుకు వచ్చిందో? పెద్దలను శాసించలేరు కనుక అణగారిన వర్గాలను ఆయన శాసిస్తారు’ అని పవన్‌కల్యాణ్‌ విమర్శించారు.

‘రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలు కలిపి 22 శాతం మంది ఉన్నారు. అలాంటప్పుడు రూ.లక్ష కోట్ల బడ్జెట్‌లో రూ.22 వేల కోట్లు వారి కోసం ఖర్చు చేయాలి. కానీ జగన్‌ ప్రభుత్వం 27 సంక్షేమ పథకాలను ఎత్తివేసింది. ఎస్సీ, ఎస్టీలకు దక్కాల్సిన రూ.20 వేల కోట్లకు కోత పెట్టింది’ అని ఆయన విమర్శించారు. ‘ఇందాక వస్తుంటే జ్యోతిబా ఫులే వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి కాలనీ అని ఒక బోర్డు చూశా. రాజశేఖరరెడ్డి గొప్ప నాయకుడు కావచ్చు.. ఫులే, అంబేడ్కర్‌లతో సమానం కాదు. గొప్ప నాయకులకు సంపూర్ణ గౌరవం ఎందుకివ్వరు? మధ్యలో వీరు వచ్చి ఎందుకు చేరడం’ అని పవన్‌కల్యాణ్‌ ప్రశ్నించారు.

నేనూ వివక్ష ఎదుర్కొన్నా:విదేశాలకు వెళ్తున్నప్పుడు నేనూ వివక్ష ఎదుర్కొన్నా. నేను మంచినీళ్లడిగితే బ్రిటిష్‌ ఎయిర్‌హోస్టెస్‌ గంటసేపు ఇవ్వలేదు. నేను విమానం దిగకుండా నిరసన తెలియజేశాను. మా డబ్బులు తీసుకుని కూడా మాకు నీళ్లివ్వడానికి ఇంత కష్టమయితే మీ ఎయిర్‌వేస్‌ మా దేశంలో నడపకండి అని చెప్పాను. పైలట్‌ నాకు క్షమాపణ చెప్పి అయిదు వైన్‌ బాటిళ్లు ఇవ్వబోయారు. ఈ విమానంలో ఉన్న అందరికీ తలో 5 వైన్‌ బాటిళ్లు ఇవ్వగల స్థాయి నాకుందని చెప్పాను. ఒక సామాజికవర్గానికి చెందిన వ్యక్తి శిరోముండనం చేస్తే ఆ సామాజికవర్గంపై కోపం ఉంటుంది. అలాగని ఆ సామాజికవర్గంలో అంతా అలాంటివారు కాదని గుర్తించాలి’ అని పవన్‌కల్యాణ్‌ అన్నారు.

దేహీ అంటే కుదరదు.. పోరాడి సాధించుకోవాల్సిందే: పవన్​కల్యాణ్​

ఇవీ చదవండి :

Last Updated : Jan 26, 2023, 7:06 AM IST

ABOUT THE AUTHOR

...view details