ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మహిళలపై ఇన్ని దాడులు జరుగుతున్నా పోలీసులు స్పందించరా?': పవన్

రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. దిశ చట్టం తీసుకొచ్చి, దిశ స్టేషన్ల ఏర్పాటు ప్రచారానికే మిగిలిపోయాయన్నారు. ఎస్సీ వర్గానికి చెందిన మహిళ హోం శాఖ మంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలపై ఇలాంటి అమానుషాలు జరగడం బాధాకరమన్నారు. అధికార నేతల అండదండలతో ఇన్ని అరాచకాలు జరుగుతున్నా..పోలీసులు చర్యలు తీసుకోకపోవడం సిగ్గు చేటన్నారు

pawan kalyan fire on cm jagan
pawan kalyan fire on cm jagan

By

Published : Aug 4, 2020, 3:06 PM IST

రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించేందుకే దిశ చట్టం తీసుకొచ్చాం, దిశ స్టేషన్లు పెట్టాం అని ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం గిరిజన మహిళలపై దాష్టీకాలకు పాల్పడుతున్నా.. చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ప్రచారం తప్ప మహిళల మాన ప్రాణాలకు రక్షణ లభించడం లేదని మండిపడ్డారు.

సత్తెనపల్లి నియోజకవర్గం పరిధిలోని తండాలో గిరిజన మహిళ రమావత్ మంత్రుబాయిని అధికార పార్టీకి చెందిన ఓ వడ్డీ వ్యాపారి ట్రాక్టర్‌తో తొక్కించి హత్య చేయడం అమానవీయమన్నారు. మృతురాలి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అటవీ భూమిని సాగు చేసుకొంటున్న ఆ గిరిజన కుటుంబంపై కిరాతకానికి పాల్పడిన వడ్డీ వ్యాపారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ డిమాండ్‌ చేశారు. అటవీ భూమిని తనఖా పెట్టుకోవడమే చట్టరీత్యా నేరమన్నారు. గిరిజనులపై ఈ విధంగా దౌర్జన్యాలకు పాల్పడుతూ, అటవీ భూములను గుప్పిట పెట్టుకొంటున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ అండ ఉండటంతో సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.

కర్నూలు జిల్లా వెలుగోడు పోలీస్ స్టేషన్ పరిధిలో వాగు వంతెన నిర్మాణ పనుల దగ్గర పని చేసే ఓ గిరిజన మహిళపై సామూహిక అత్యాచారం జరిగినా.. పోలీసులు కేసు నమోదు చేసుకోలేదన్నారు. భర్త కళ్లెదుటే అత్యాచారం చేశారని బాధితురాలు చెప్పినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇక చట్టాలు చేసి ఏమి ప్రయోజనమన్నారు. మహిళకు ఏ కష్టం వచ్చినా ఎక్కడైనా ఫిర్యాదు చేసేలా తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ముఖ్యమంత్రి చెప్పుకొంటున్నా.. క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదన్నారు.

కర్నూలు జిల్లాలో తన బిడ్డపై అత్యాచారం చేసి చంపేశారని ఆమె తల్లి ఏళ్ల తరబడి పోరాడాల్సి వచ్చిందన్నారు. ఆమెకు మద్దతుగా జనసేన కర్నూలులో ర్యాలీ చేస్తే తప్పడు కేసులు పెట్టారన్నారు. ప్రతి కేసు విషయంలో.. చర్యల కోసం ప్రజలు రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని పవన్ మండిపడ్డారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో దళిత మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగినా పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరించడం లేదంటే.. వారిపై రాజకీయ ఒత్తిళ్ళు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం అవుతోందన్నారు. ఎస్సీ వర్గానికి చెందిన మహిళ హోం శాఖ మంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలపై ఇలాంటి అమానుషాలు జరగడం బాధాకరమన్నారు. శివాపురం తండా, వెలుగోడు ఘటనలకు బాధ్యులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:కరోనా సోకి సీపీఎం నేత సున్నం రాజయ్య మృతి

ABOUT THE AUTHOR

...view details