Nine Years Completed to Swacha Challapalli: చల్లపల్లి... సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం మురుగు పారుదల లేని అస్తవ్యస్త డ్రైనేజీ వ్యవస్థ, రహదారుల వెంబడి అపరిశుభ్ర వాతావరణం, వెరసి డంపింగ్ యార్డు వైపు వెళ్లాలంటేనే భయమేసేది. గంగులవారిపాలెం, నాగాయలంక, పాగోలు, నడకుదురు, విజయవాడ రహదారులతోపాటు ఎస్సీ వసతి గృహం బజారు, పట్టణంలో మరో రెండు ప్రముఖ రహదారులు సైతం బహిర్భూమికి వెళ్లేవారి వ్యర్థాలు, చెత్త కుప్పలతో దుర్గందభరితంగా ఉండేవి.
స్వచ్ఛత పాటించిన కాలనీలకు అవార్డుల ప్రదానం
ఈ పరిస్థితి మార్చాలన్న సంకల్పంతో వైద్యులు డీఆర్‌కే ప్రసాద్, పద్మావతి 2014 నవంబరు 12న స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొదట జనాల్లోకి వెళ్లే ముందు అత్యంత అపరిశుభ్రమైన గంగులవారిపాలెం బజారులో భూగర్భ డ్రైనేజీ నిర్మించి పచ్చదనంతో అందమైన ప్రదేశంగా తీర్చిదిద్ది పట్టణంలోని మిగిలిన ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తూ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. 15 మంది కార్యకర్తలతో ప్రారంభమైన స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమంలో ప్రస్తుతం 120 మంది నిత్యం శ్రమదానం చేస్తూ ప్రజల్లో స్ఫూర్తి నింపుతున్నారు.
నేడు స్వచ్ఛ చల్లపల్లి.. యుద్ధ సైనికుల్లాంటి కార్యకర్తల కృషితో కష్టతరంగా ఉండే రోజుల నుంచి పట్టణ ప్రజలు ప్రస్తుతం పచ్చదనంతో ఆహ్లాదకర వాతావరణంలో సంతోషంగా జీవిస్తున్నారు. పట్టణంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా నందనవనంలోకి అడుగు పెడుతున్నామా అనే అనుభూతి కలుగుతుంది.
గ్రామస్థుల సహకారంతో స్వచ్ఛత - పరిశుభ్రత కార్యక్రమాలు
పలు రహదారుల్లో 25 వేల మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. ఈ సంవత్సరం మచిలీపట్నం నుంచి రేపల్లెకు వెళ్లే జాతీయ రహదారిలో రెండు కిలోమీటర్ల విస్తీర్ణంలో రెండువైపులా, శివరామపురం- వెంకటాపురం రహదారిలో నీడనిచ్చే, పూలు, పండ్ల మొక్కలు నాటారు. ప్రతి రహదారి వెంబడి, డంపింగ్‌యార్డు, శ్మశానం, బస్టాండ్ వంటి ప్రదేశాలు ప్రస్తుతం పచ్చదనంతో అలరారుతున్నాయి.
ఎస్.ఆర్.వై.ఎస్.పి. జూనియర్ కళాశాల ప్రాంతం నుంచి పేవర్‌టైల్స్, రంగుల ఫెన్సింగ్ ఏర్పాటు, నాగాయలంక రహదారి, చల్లపల్లి ప్రధాన కూడలి, ఎన్టీఆర్ పార్కు, డంపింగ్‌యార్డు, శ్మశానవాటికలో మరుగుదొడ్లు నిర్మించి వాటిపై అందమైన డిజైన్లతో తీర్చిదిద్దారు. మొక్కల సంరక్షణ, సామాజిక మరుగుదొడ్ల శుభ్రత వంటి కార్యక్రమాల కోసం "మన కోసం మనం ట్రస్ట్" ద్వారా 23 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. మురుగు కాల్వలు ప్లాస్టిక్ వ్యర్థాలతో పేరుకుపోతుండడంతో ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించాలంటూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు నార సంచులు అందిస్తున్నారు.
స్వచ్ఛత అవార్డు పొందిన నగరం..ఇప్పుడు చెత్తతో దర్శనం
స్వచ్ఛచల్లపల్లి 9వ వార్షికోత్సవం సందర్భంగా అందరూ సమావేశమయ్యారు. ప్రజలకు అవగాహన కల్పించేలా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. పారిశుద్ధ్యాన్ని పారదోలి ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనాన్ని కల్పించడం సేవకాదని.. ఇది ఒక సామాజిక బాధ్యత మాత్రమే అని స్వచ్ఛ చల్లపల్లి రథసారథులు డీఆర్‌కే ప్రసాద్, పద్మావతి తెలిపారు. ఒక బృహత్తర కార్యక్రమం జరగాలంటే ముందు ఓర్పు ఉండాలని.. బాధ్యత గల ప్రతి పౌరుడు ఆ దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
స్వచ్ఛత కోసం పిచ్చోడి అవతారమెత్తిన 'అభిమన్యు'డు