హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కలిశారు. న్యాయస్థానం తీర్పు అంశంపై గవర్నర్‌కు వివరించారు. తనను రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ)గా పునర్నియమించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.
హైకోర్టు ఆదేశాల మేరకు గవర్నర్‌ను కలిశా. కోర్టు ధిక్కరణ అంశాన్ని వివరించా. ఎస్‌ఈసీగా తిరిగి నియమించాలన్న హైకోర్టు తీర్పు అంశాన్ని తెలియజేశా. నా విజ్ఞాపనను గవర్నర్ సానుకూలంగా స్వీకరించారు. గవర్నర్ జోక్యంతో సానుకూల ఫలితం వస్తుందని ఆశిస్తున్నా-రమేశ్ కుమార్
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తనను నియమించాలని హైకోర్టు ఆదేశించినా.. రాష్ట్ర ప్రభుత్వం ధిక్కరణకు పాల్పడుతోందంటూ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఈనెల 17న విచారణ జరిపిన న్యాయస్థానం... రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించినా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను పునరుద్ధరించాలన్న తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మరోవైపు హైకోర్టు తీర్పు అమలు చేయాల్సిందిగా గవర్నర్‌ను కోరాలని నిమ్మగడ్డకు చెప్పింది. గవర్నర్‌ను కలిసిన తర్వాత జరిగిన పరిణామాలను తమ దృష్టికి తేవాలని కూడా హైకోర్టు పేర్కొంది. న్యాయస్థానం ఆదేశాలతో ఇవాళ గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు నిమ్మగడ్డ రమేశ్ కుమార్.
ఇదీ చదవండి
నిమ్మగడ్డ వ్యవహారం... సుప్రీంలో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్