Azadi ka Amrut Mahotsav: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా జాతీయ పతాక రూపకర్త(Designer of the National Flag), స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య(Pingali Venkayya) 146వ జయంతి సందర్భంగా.. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. పింగళి వెంకయ్య జీవిత చరిత్రపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను సీఎం తిలకించారు. అనంతరం ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సాంస్కృతిక శాఖ డైరెక్టర్ రేగుళ్ళ మల్లికార్జునరావు స్వయంగా చిత్రించిన పింగళి వెంకయ్య చిత్రపటాన్ని సీఎం ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.
బందరు రోడ్డులోని బాపు పురావస్తు ప్రదర్శనశాలలో జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య, స్వాతంత్య్ర సమరయోధులు బళ్లారి రాఘవ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. దేశభక్తి పరిఢవిల్లేలా విద్యార్ధుల నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరానికి పింగళి వెంకయ్య సమావేశ మందిరంగా నామకరణం చేశారు. కలెక్టర్ ఢిల్లీరావు, ఎమ్మెల్సీ లక్ష్మణరావు మందిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు. పింగళి వెంకయ్య స్వగ్రామమైన కృష్ణా జిల్లా మొవ్వ మండలం భట్లపెనుమర్రులో ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో కలెక్టర్ రంజిత్ బాషా, ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్, జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక, అధికారులు... పింగళి చిత్రపటానికి నివాళి అర్పించారు. భట్లపెనుమర్రులో నిర్వహించిన వేడుకల్లో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పాల్గొని....పింగళి వెంకయ్య, మహాత్మా గాంధీ విగ్రహాలకు నివాళులు అర్పించారు. సభా ప్రాంగణం వద్ద చెత్తను లక్ష్మీనారాయణ స్వయంగా ఏరివేశారు. దేశ ప్రజల్లో స్ఫూర్తిని నింపేలా జాతీయ జెండాకు రూపకల్పన చేసిన మహానుభావుడు పింగళి వెంకయ్య అని కొనియాడిన లక్ష్మీనారాయణ.. ఆయనకు భారతరత్న ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
కర్నూలు మాంటిస్సోరీ పాఠశాల విద్యార్థులు వందేమాతరం పేరుతో మాతృభూమికి వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు. 3వేల5వందల మంది విద్యార్థులు...దేశ చిత్రపటం రూపంలో నిల్చొని దేశ భక్తిని చాటారు. విద్యార్థులు చేసిన దేశభక్తి నృత్యాలు ఆకట్టుకున్నాయి. 75 మంది 75 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాన్ని వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చేర్చారు.