నివర్ తుపాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని..జనసేన పార్టీ నేత నాదేండ్ల మనోహర్ విమర్శించారు. నివర్ తుపాను వల్ల కృష్ణా జిల్లాలో ఎక్కువ మంది రైతులు నష్టపోయారన్న ఆయన.. సాయం అందక కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నివర్ తుపాను కారణంగా నష్టపోయిన ప్రతి ఎకరాకి 35 వేల రూపాయల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.
కృష్ణా జిల్లాకు చెందిన జనసేన నేతలు, కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతులకు భరోసా కల్పించేందుకు కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ నెల 28న జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ కృష్ణా జిల్లా కలెక్టర్‌కు స్వయంగా వినతిపత్రం సమర్పిస్తారని వెల్లడించారు.