గ్రామాల్లో పౌరసరఫరాల శాఖ పనితీరుపై ఎన్నో విమర్శలున్నాయి. రేషన్ సరుకుల్లో నాణ్యత లేదని..పంపిణీ సమయంలో ప్రజలను డీలర్ల ఇబ్బందులు పెడుతున్నారని ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ వాలంటీర్ల ద్వారా నేరుగా ఇంటికే రేషన్ సరుకులను అందించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో వాటికోసం రూపొందించిన వాహనాలను విజయవాడలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, కొడాలి నాని, చెరకువాడ రంగనాథరాజు పరిశీలించారు.
విజయవాడ సబ్ కలెక్టరు కార్యాలయం ప్రాంగణంలో రాష్ట్ర పౌర సరఫరాలశాఖ కమిషనర్ కోన శశిధర్ నమూనా వాహనాలను మంత్రులకు చూపించారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత ద్వారా నిత్యావసర సరకులను ఇంటి వద్దకే ఇవ్వాలనేది ప్రభుత్వ సంకల్పమని మంత్రి బుగ్గన తెలిపారు. ఆ దిశగా త్వరగా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.