ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా 1,452 సెంటర్లు ఏర్పాటు చేశాం: మంత్రి సురేష్ - INTER EXAMS IN AP

రాష్ట్రంలో నిర్వహించనున్న ఇంటర్‌ పరీక్షలు, వాటి నిర్వహణ తదితర అంశాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ వివరించారు. ఈ ఏడాది ఇంటర్‌ పరీక్షల నిమిత్తం 1,452 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గతంతో పోల్చితే అదనంగా 41 సెంటర్లనే అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సెంటర్ల వద్ద కొవిడ్‌ వ్యాప్తి నివారణ చర్యలు తీసుకుంటున్నామని.... ఈ మేరకు పనులను పర్యవేక్షించాల్సిందిగా జిల్లా కలెక్టర్లు, ఆర్‌ఐవోలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు.

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు  సురేశ్‌
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌

By

Published : Apr 30, 2021, 4:13 AM IST

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నిర్వహించనున్న ఇంటర్‌ పరీక్షలు, వాటి నిర్వహణ తదితర అంశాలను మంత్రి వివరించారు. ఈ ఏడాది ఇంటర్‌ పరీక్షల నిమిత్తం 1,452 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గతంతో పోల్చితే అదనంగా 41 సెంటర్లనే అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. జిల్లాల వారీగా చూస్తే.. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 146 సెంటర్లు, అత్యల్పంగా గుంటూరు జిల్లాలో 60 సెంటర్లను పరీక్షల కోసం సిద్ధం చేసినట్లు తెలిపారు. సగటున ప్రతి జిల్లాలో 80కిపైగా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సెంటర్ల వద్ద కొవిడ్‌ వ్యాప్తి నివారణ చర్యలు తీసుకుంటున్నామని.. ఈ మేరకు పనులను పర్యవేక్షించాల్సిందిగా జిల్లా కలెక్టర్లు, ఆర్‌ఐవోలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు.

జాగ్రత్తగా పరీక్షలను నిర్వహిస్తాం..

‘‘విద్యార్థుల భవిష్యత్తు, భద్రత ప్రభుత్వం బాధ్యత. పరీక్షలను రద్దు చేయడం సులభమే కానీ విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుంది. వారి భవిష్యత్తు దృష్ట్యా సీఎం జగన్ ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఏ రాష్ట్రంలోనూ ఇంటర్ పరీక్షలను రద్దు చేయలేదు. అన్ని విధాలా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం. విద్యార్థులు, పరీక్షలను అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. అసత్య ఆరోపణలు చేస్తూ తల్లిదండ్రులు, విద్యార్థుల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఆరోపణలు మానుకోవాలని విపక్షాలను కోరుతున్నా. పరీక్షలు నిర్వహించకుండా కేవలం పాస్ సర్టిఫికెట్లు ఇస్తే విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుంది. పరీక్షలు నిర్వహించడం వల్ల వారి ఆత్మ స్థైర్యం పెరుగుతుంది. తల్లిదండ్రులు ఎవరూ ఆందోళనకు గురికావొద్దు. చాలా జాగ్రత్తగా పరీక్షలను నిర్వహిస్తాం.

సాయంత్రం నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు..

ఇవాల సాయంత్రం 6 గంటల నుంచి ఇంటర్‌ బోర్డు వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంటివద్ద నుంచే పరీక్షా కేంద్రంలోని సీటు తెలుసుకునే ఏర్పాటు చేశాం. ఐపీఈ ఎగ్జామ్ సెంటర్ లొకేటర్ పేరిట యాప్‌ను రూపొందించాం. ఈ యాప్‌ను విద్యార్థులు డౌన్‌లోడ్‌ చేసుకుని పరీక్షా కేంద్రంలో సీటు వివరాలను తెలుకోవచ్చు. పరీక్షా కేంద్రాల్లో కొవిడ్ వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. కేంద్రాల వద్ద భౌతికదూరం పాటించడం, శానిటైజర్ వినియోగం సహా ఇతర నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటాం. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది.

పాజిటివ్‌ వచ్చిన విద్యార్థులకు తర్వాత పరీక్షలు..

పరీక్షల నిర్వహణను సీఎం జగన్ కూడా పర్యవేక్షిస్తారు. కలెక్టర్ల పర్యవేక్షణలో ఏర్పాట్లన్నీ నడుస్తున్నాయి. ఉపాధ్యాయులు, సిబ్బంది పరీక్షల నిర్వహణకు పూర్తిగా సహకరిస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు. విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు పూర్తయ్యాయి. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థంగా అమలు చేసి దేశంలో రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలుపుదాం. కొవిడ్ పాజిటివ్ వచ్చిన విద్యార్థులు పరీక్షలు రాయకూడదు. వారికి మళ్లీ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తాం. రెగ్యులర్ పరీక్షల తరహాలో మళ్లీ పరీక్షలు నిర్వహిస్తాం. రెగ్యులర్ విధానంలో పాసైనట్లుగానే ఆ విద్యార్థులకు ధ్రువపత్రాలు జారీ చేస్తాం.

ప్రతి కేంద్రంలో ఐసోలేషన్‌ గది..

వచ్చే నెల 5వ తేదీ నుంచి ఇంటర్‌ పరీక్షలు ఉంటాయి. మే 5 నుంచి 19 వరకు 98 శాతం పరీక్షలు పూర్తి అవుతాయి. మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులకు రోజు విడిచి రోజు పరీక్షలు జరుగుతాయి. పరీక్షల మెటీరియల్‌ను సంబంధిత కేంద్రాలకు ఇప్పటికే పంపించాం. ప్రశ్నాపత్రాలను సంబంధిత పోలీసు స్టేషన్లకు పంపుతున్నాం. జిల్లాకు ఒకరు చొప్పున 13 మంది కొవిడ్ స్పెషల్ అధికారులను నియమించాం. కేంద్రాల వద్ద స్క్వాడ్లు, మొబైల్ మెడికల్ వ్యాన్లు, థర్మల్ స్కానర్లు, మాస్కులు అందిస్తాం. ప్రతిరోజూ పరీక్షా కేంద్రాలను శానిటైజ్‌ చేయాలని ఆదేశాలిచ్చాం. కరోనా లక్షణాలున్న విద్యార్థుల కోసం ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. పరీక్షా కేంద్రాల వద్ద ఉండే సిబ్బందికి పీపీఈ కిట్లు అందిస్తాం’’ అని మంత్రి వివరించారు.

ఇవీ చదవండి

ఫిబ్రవరి వరకూ జాగ్రత్త తప్పదు

ABOUT THE AUTHOR

...view details