ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంద్రకీలాద్రిపై.. నత్తనడకన మల్లేశ్వర స్వామి ఆలయ విస్తరణ! - ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధి

ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతుంటే... చెంతనే ఉన్న మల్లేశ్వరుడి ఆలయం మాత్రం విస్తరణ పనులతో భక్తులను ఇబ్బంది పెడుతోంది. రెండు క్యూలైన్లలో భక్తులు స్వామి దర్శనానికి వెళ్లేందుకు గంటల సమయం పడుతుంది. ఓ దాత సహకారంతో విస్తరణ పనులు చేపట్టగా.. దసరా నాటికి పనులు పూర్తి చేయాలని అనుకున్నారు. ఉత్సవాలు సమీపిస్తున్నా.. పనులు మాత్రం పూర్తి కాక నత్తనడకన కొనసాగుతున్నాయి.

malleswara-swamy-temple

By

Published : Sep 21, 2019, 12:30 PM IST

ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వరస్వామి సన్నిధి. అమ్మవారిని దర్శించుకునే భక్తుల్లో చాలా మంది స్వామి వారిని సైతం దర్శించుకుంటారు. దసరా ఉత్సవాల సమయంలో భారీగా తరలివచ్చే భక్తులు కొండపై ఉన్న ఆలయాలన్నిటినీ దర్శించుకునే విధంగా క్యూ లైన్లు ఏర్పాటు చేస్తారు. ఘాట్ రోడ్డు మీదుగా వేసిన క్యూలైన్లలో అమ్మవారిని దర్శించుకున్న భక్తుల్లో చాలా మంది మల్లేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్లేందుకు మెట్ల మార్గం గుండా కిందకు దిగిపోతారు. ఈ సారి మాత్రం ఆ పరిస్థితి లేనట్టే కనిపిస్తోంది.

ఇంద్రకీలాద్రిపై పూర్తికాని మల్లేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులు

పర్వదినాల్లో స్వామివారి దర్శనానికి భారీగా భక్తులు వస్తుంటారు. కానీ ఆలయ వీస్తీర్ణం తక్కువగా ఉన్న కారణంగా... కేవలం రెండు క్యూలైన్లు మాత్రమే ఏర్పాటు చేశారు. భక్తులు సంఖ్య పెరిగినప్పుడు దర్శనానికి గంటల కొద్ది సమయం పడుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆలయ ముందు భాగాన్ని విస్తరించి క్యూలైన్ల సంఖ్య పెంచాలని అధికారులు భావించారు. విరాళానికి ఓ దాత ముందుకురాగా....ఈ ఏడాది ఏప్రిల్ నెలలో పనులు ప్రారంభించారు. ఇప్పటికీ పూర్తి చేయలేకపోయారు.

పని పూర్తి కావడానికి మరో ఆరు నెలల సమయం పడుతుందని ఆలయ కార్యనిర్వహాణాధికారి ఎం.వి.సురేష్ బాబు వెల్లడించారు. దసరా సమయానికి శివాలయ విస్తరణ పనులు పూర్తికావని స్పష్టం చేశారు. ఫలితంగా.. ఈ సారి స్వామివారి దర్శనం కాస్త కష్టంగానే చేసుకోవాల్సి వస్తుందని భక్తులు ఆవేదన చెందుతున్నారు. రద్దీని నియంత్రించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలించాలని అధికారులను కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details