ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కృష్ణా జెడ్పీ పీఠం ఏ పార్టీది..?

స్థానిక సంస్థల ఎన్నికల పోరు మొదలైంది. అన్ని పార్టీలు సమరానికి సిద్దమవుతున్నాయి. కృష్ణాజిల్లా జడ్పీకి ప్రత్యేక స్థానం ఉంది. కేంద్ర ప్రభుత్వం చేతుల మీదుగా ఉత్తమ జిల్లా పరిషత్​ అవార్డు పొంది మార్గదర్శకంగా నిలిచింది. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని నగరం ఈ జిల్లాలో ఉండటంతో స్థానిక సంస్థల ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది . 46 జడ్పీటీసీ, 723 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. గత ఎన్నికల్లో ఛైర్మన్ పదవిని తెదేపా కైవసం చేసుకోగా ఈసారి వైకాపా అధికారంలో ఉండటంతో ఛైర్మన్ స్థానం ఎవరు దక్కించుకుంటారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముచ్చటగా మూడోసారి ఛైర్మన్ స్థానాన్ని మహిళకు కేటాయించటంతో అందరి దృష్టి కృష్ణా జిల్లా జడ్పీ పీఠంపై పడింది.

major-parties-focus-on-krishna-zilla-parishat
major-parties-focus-on-krishna-zilla-parishat

By

Published : Mar 11, 2020, 12:50 PM IST

కృష్ణా జెడ్పీ పీఠం ఏ పార్టీది..?

స్థానిక సంస్థల పోరు వేడెక్కింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం రిజర్వేషన్లను 50 శాతానికే పరిమితం చేసి .. ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఖరారు చేశారు. దీంతో ఆశావాహులు అవకాశం ఇవ్వాలని పార్టీలు, నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పార్టీలు గెలుపుగుర్రాల వేటలో నిమగ్నమయ్యాయి. జిల్లాలో 49 జడ్పీటీసీ స్థానాలుండగా 4 స్థానాల ఎన్నిక వాయిదా వేయగా, 812 ఎంపీటీసీ స్థానాలకు 723 ఎంపీటీసీ స్థానాలకు మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. బందరు ,పెనమలూరు , జగ్గయ్యపేట జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి గ్రామాల విలీనాంశాలు పెండింగ్​లో ఉండటంతో వాటికి ఎన్నికలను వాయిదా వేసినట్లు ఎన్నికల కమిషనర్ తెలిపారు.

ముచ్చటగా మూడోసారి 'ఆమెకే'

1960 నుంచి 1987 వరకు జిల్లా పరిషత్ ఎన్నికలు మూడంచెల విధానంలో జరిగాయి. అనంతరం ప్రత్యక్ష పద్దతిలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 1963 నుంచి 1983 వరకు జిల్లాపరిషత్ బోర్డ్ అని పిలిచేవాళ్లు. మొదటి ఛైర్మన్​గా యార్లగడ్డ శివరాంప్రసాద్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. ఇప్పటివరకు 13 మంది ఛైర్మన్​లుగా, ఇంఛార్జ్ ఛైర్మన్​లుగా పనిచేశారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పిన్నమనేని కోటేశ్వరరావు విడతల వారీగా సుమారు 19 ఏళ్ల పాటు ఛైర్మన్​గా పనిచేశారు. 1983లో తెదేపా ఆవిర్భావ నుంచి ఇప్పటికి నాలుగు సార్లు తెలుగుదేశం పార్టీ ఛైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. మొదటి సారి 1983లో ఆ పార్టీ నుంచి పోటీ చేసిన సుంకర సత్యనారాయణ ఛైర్మన్​గా ఎన్నికయ్యారు. 2001లో మొదటి సారి మహిళకు ఛైర్మన్ పదవిని కేటాయించారు. తెదేపా నుంచి పోటీ చేసిన ఎన్ సుధారాణి కృష్ణా జిల్లా జడ్పీకి మొదటి మహిళా ఛైర్మన్​గా ఎన్నికయ్యారు. అనంతరం 2014లో రెండో సారి మహిళా ఛైర్మన్​గా తెదేపా నుంచి పోటీ చేసిన గద్దె అనురాధా ఛైర్మన్​గా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో కూడా ఛైర్మన్ సీటును మహిళకు కేటాయించటంతో ఎన్నికలు మరింత ఆసక్తిని రేపుతున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు టికెట్ కోసం పోటీ పడుతున్నారు.

హ్యాట్రిక్ కొడతాం :దేవినేని ఉమా

తాను జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్​గా పనిచేయటం ఎంతో సంతోషంగా ఉందని మాజీ జడ్పీఛైర్ పర్సన్ గద్దె అనురాధా అన్నారు. ఐదేళ్లలో జిల్లాలోని గ్రామాల అభివృద్ధి కోసం 100 కోట్ల రూపాయల మేర నిధులను ఖర్చు చేశామన్నారు. ఈసారి కూడా మహిళలకు జడ్పీ పీఠం కేటాయించటం మంచి పరిణామన్నారు. కచ్చితంగా తెదేపా అభ్యర్థి ఛైర్ పర్సన్ స్థానాన్ని కైవసం చేసుకుంటారని ధీమా వ్యక్తం చేశారు.

ఈసారి పీఠం మాదే: వైకాపా

గత ఎన్నికల్లో తెదేపా అత్యధికంగా జడ్పీటీసీ సీట్లు దక్కించుకుంది. ప్రస్తుతం వైకాపా అధికారంలో ఉండటంతో ఆ పార్టీలో ఆశావాహులు పెరిగిపోయారు. ఛైర్మన్ స్థానం దక్కించుకునేందుకు వ్యూహం రచిస్తున్నారు. సీఎం జగన్ చేసిన అభివృద్ది, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని వైకాపా నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. జడ్పీ పీఠాన్ని కైవసం చేసుకుంటామంటున్నారు.

తొలిసారిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈసారి నోటాను వినియోగించనున్నారు. ప్రతిబ్యాలెట్​లో చివరన ఈ గుర్తును పొందుపరుస్తారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల సంఖ్య, గుర్తులు ఆధారంగా వీటి ముద్రణకు చర్యలు తీసుకుంటున్నారు. ముద్రణ అనంతరం ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇవి అధికారుల ఆధీనంలో ఉంటాయి.

ఇదీ చదవండి : మున్సి 'పోల్స్': నామినేషన్ల దాఖలుకు నియమ నిబంధనలు

ABOUT THE AUTHOR

...view details