ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాడు పనికిమాలిన సభ అన్న జగన్​.. నేడు వారిని గెలిపించుకునేందుకు పాట్లు

MLC Elections : శాసన మండలిని రద్దు చేస్తామని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు పడరానిపాట్లు పడుతున్నాడని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. దొంగసారా కేసులో ముద్దాయిని పెద్దల సభకు పంపడం యావత్ తెలుగుజాతికి అవమానం అని ఆయన పేర్కొన్నారు. దొంగ ఓట్లు, డబ్బు పంపిణీతో గెలవాలని ప్రయత్నిస్తున్న వైఎస్సార్సీపీకి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని, ఆత్మగౌరవంతో జీవిస్తారో లేక అమ్ముడుపోయే సరకుగా మారుతారో ఆలోచించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Mar 7, 2023, 4:30 PM IST

CPI, CPM leaders on MLC Elections : శాసనమండలి పనికి మాలిన సభ అని, మండలిని రద్దు చేయాలని ముఖ్యమంత్రి జగన్ కేంద్రాన్ని కోరారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. మండలి రద్దు సాధ్యం కాలేదు కాబట్టి.. నేడు మండలిని తమ పార్టీ నేతలతో ఆక్రమించాలని చూస్తున్నారని మండిపడ్డారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉపాధ్యాయుల సమస్యలు ఎన్ని పరిష్కరించారో చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వస్తే వారంలో సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారని.. సీపీఎస్ రద్దు ఎక్కడ చేశారు..? ఎప్పుడు చేశారని ప్రశ్నించారు. సీపీఎస్ రద్దు చేయకుండా అందుకు ప్రత్యామ్నాయంగా ఇప్పుడు జీపీఎస్ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పీఆర్సీ నివేదికను అమలు చేయాలన్నారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హమీ ఇచ్చారని, ఇంతవరకు ఎన్ని జాబ్ క్యాలెండర్లను విడుదల చేశారని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి ఆరు నెలల్లో యూనిఫైడ్ సర్వీస్ రూల్ మార్చుతామని హమీ ఇచ్చారని, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు రెండేళ్లలో పరిష్కరిస్తామని, లేనిపక్షంలో రాజీనామా చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కాబట్టి.. ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. తూర్పు రాయలసీమ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్యాంసుందర్ రెడ్డి దొంగసారా కేసులో ముద్దాయిగా ఉన్నారని తెలిపారు. ఇటువంటి వారిని పెద్దల సభకు పంపి వైఎస్సార్సీపీ శాసన మండలిని అపహాస్యం చేస్తోందని చెప్పారు.

గెలుపే లక్ష్యంగా అడ్డదారులు... దొంగ ఓట్లు, అధికార దుర్వినియోగంతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీ గెలవాలని చూస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. తిరుపతిలో ఇల్లే లేని వారికి ఇంటి నంబర్ పెట్టి 14 దొంగ ఓట్లు సృష్టించారని మండిపడ్డారు. తిరుపతిలో ఇష్టానుసారంగా దొంగ ఓట్లను చేరుస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటుకు రూ.2 వేలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటుకు రూ.5 వేలను వైఎస్సార్సీపీ నేతలు ఇస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో డబ్బులు పంపిణీని మంత్రలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.

ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న జిల్లాలో నిజాయితీగా విధులు నిర్వహిస్తున్న అధికారులను ప్రభుత్వం బదిలీ చేసిందన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉప కులపతి ప్రసాద్ రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశాల్లో పాల్గొన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, వాలంటీర్ లు అందరూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పనిలోనే ఉన్నారని, వైఎస్సార్సీపీని ఎలాగైనా గెలిపించాలని వారితో అధికార దుర్వినియోగం చేయిస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఉపాధ్యాయులు, ఉద్యోగులు గమనించాలని కోరారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ వైఎస్సార్సీపీకి గుణపాఠం చెప్పాలని కోరారు.

సీపీఐ సీపీఎం నాయకులు

శాసన మండలి పనికిమాలిన సభ అని, దానిని రద్దు చేయాలని చెప్పిన వైఎస్సార్సీపీ.. ఇవాళ అదే ఎన్నికల్లో తన అభ్యర్థులను గెలిపించుకునేందుకు పడరాని పాట్లు పడుతోంది. ఉద్యోగులు, ఉపాధ్యాయల్లో ప్రభుత్వంపై తీవ్రమైన కసి, ఆగ్రహం ఉంది. దాని నుంచి తప్పించుకునేందుకు డబ్బులు పెట్టి అయినా గెలవాలని వైఎస్సార్సీపీ భావిస్తోంది. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈ నాలుగేళ్లలో ఎన్ని సమస్యలు పరిష్కరించారో చెప్పాలి. పీఆర్సీ నివేదికను కూడా అమలు చేయలేదు. గతంలో హామీలిచ్చి గెలిచిన కల్పలతారెడ్డి మళ్లీ ఏం మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు. సారాయి కేసుల్లో నిందితులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం కల్పించి పెద్దల సభకు పంపడం సిగ్గుచేటు. ఇది యావత్ తెలుగు జాతికే తలవంపులు.- శ్రీనివాసరావు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ వర్గాలు మాత్రమే పాల్గొనేవి. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా అధికార పార్టీ తరఫున టీచర్స్ ఎన్నికల్లో అభ్యర్థిని ప్రకటించలేదు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లోనూ నేరుగా జోక్యం చేసుకోలేదు. కానీ, సీఎం జగన్ మోహన్ రెడ్డి.. ఇప్పటికే అసెంబ్లీ అంతా ఆయనే ఉన్నారు. ప్రతిపక్ష పార్టీల నుంచి ఫిరాయింపులు ప్రోత్సహించారు. రాజకీయ, లోకల్ బాడీ, ఎమ్మెల్యేల తరఫున అన్నీ గెలిపించుకున్నారు. అయినా చాలదన్నట్లు.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ జోక్యం చేసుకుంటున్నారు. అవి కూడా పద్ధతి ప్రకారం ప్రచారం చేయకుండా.. నీతి, నియమాలు లేకుండా వ్యవహరిస్తున్నారు. దొంగ ఓట్లు చేరుస్తున్నారు. ఆత్మగౌరవంతో జీవిస్తారా లేక అమ్ముడుపోయే సరుకుగా మారుతారో ఆలోచించుకోవాలి. ప్రజాస్వామ్యానికి పెను విపత్తు దాపురించిన తరుణంలో ఉన్నత విద్యావంతులుగా విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలి. - రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details