తెలంగాణలో ఈసారి వివిధ కోర్సుల ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్ల పర్వం నుంచే గందరగోళం మొదలైంది. ఓ వైపు ఎంసెట్ దరఖాస్తు ప్రక్రియ ఆలస్యమవుతుంటే.. మరోవైపు ఎడ్‌సెట్ ప్రవేశ ప్రకటన ఇప్పటికీ విడుదల కాలేదు. ఇంకోవైపు ఆర్థికంగా వెనకబడిన వర్గాల రిజర్వేషన్ ఎలా అమలు చేస్తారనేదానిపై స్పష్టత రాలేదు.
ఈడబ్ల్యూఎస్ కోటా అమలు విధానంపై అస్పష్టత...
ఎంసెట్ ప్రవేశ ప్రకటన ఈ నెల 18వ తేదీన వెలువడింది. 20వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం హాల్‌టికెట్లు జారీ చేస్తేనే దరఖాస్తు చేసుకోవడానికి వీలవుతుంది. ఇంటర్‌బోర్డు ఇప్పటివరకు వాటిని ఆన్‌లైన్‌లో పెట్టలేదు. విద్యాసంస్థలను మూసివేయడంతో హాల్‌టికెట్ల జారీపై సందిగ్ధత నెలకొంది. ఇంటర్ బోర్డు వర్గాలు మాత్రం త్వరలోనే ఇస్తామని చెబుతున్నాయి. ఫలితంగా 10 రోజులుగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. ఏటా దాదాపు 2.40 లక్షల మంది అప్లై చేస్తుంటారు.
ఎడ్‌సెట్.. జీఓ వచ్చేవరకు నోటిఫికేషన్ రాదు...
బీఈడీ సీట్ల భర్తీకి నిర్వహించే ఎడ్‌సెట్-2021లో ఈసారి పలు సంస్కరణలు చేశారు. ఒక్కో మెథడాలజీకి ఒక్కో ప్రశ్నపత్రం కాకుండా అన్ని సబ్జెక్టుల వారికి ఉమ్మడి ప్రశ్నపత్రం లాంటి మార్పులు చేశారు. ఈ నెల 23 లేదా 24న నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది. ఎడ్‌సెట్ కమిటీ చేసిన మార్పులకు సంబంధించి గతంలో ఉన్న జీఓల్లో సవరణలు చేసి ప్రభుత్వం కొత్తగా జీఓలు జారీ చేయాల్సి ఉంది.
ప్రతిపాదనలు వెళ్లినా..
విద్యాశాఖకు ప్రతిపాదనలు వెళ్లినా జీఓ మాత్రం జారీ కాలేదు. నోటిఫికేషన్‌లో స్వల్ప మార్పులు చేశామని, వారంలోపు కొత్త కాలపట్టిక విడుదల చేస్తామని ఎడ్‌సెట్ అధికారులు ఈ నెల 21న ప్రకటించారు. వారం దాటినా జీఓ వెలువడలేదు. ఫలితంగా నోటిఫికేషన్ రాలేదు. దాదాపు 40 వేల మంది అభ్యర్థులు దానికోసం ఎదురుచూస్తున్నారు.