చెన్నై నగరానికి తాగునీరు సక్రమంగా ఇచ్చేందుకు ఎగువ, దిగువ రాష్ట్రాలు సహకరించాలని కృష్ణా బోర్డు ఛైర్మన్ పరమేశం సూచించారు. కృష్ణా పరీవాహకంలోని రాష్ట్రాలు జల వినియోగ లెక్కలను పంపించాలని మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలను కోరారు. జలవనరుల శాఖ ఇంజినీర్లతో ఆన్‌లైన్ ద్వారా నిర్వహించిన చెన్నై తాగునీటి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల నుంచే తాగునీటిని విడుదల చేయాలని తమిళనాడు బోర్డును కోరగా... ఆంధ్రప్రదేశ్ అందుకు ఏర్పాట్లు చేయాలని సూచించింది. చెన్నైకి తాగునీటి విడుదల ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు గడిచిన నీటి సంవత్సరంలోనే గరిష్ఠంగా (8.07 టీఎంసీలు) నీళ్లు అందాయని పేర్కొంది. శ్రీశైలం నుంచి తీసుకుంటున్న నీటి వాటాలో తమిళనాడు సరిహద్దు వరకు 12 టీఎంసీల నీళ్లు చేరేలా ఏపీ చూడాలని ...తెలంగాణ సూచించింది.
దీనిపై ఏపీ స్పందిస్తూ వెలుగోడు, సోమశిల, కండలేరు జలాశయాల్లో కనీస నీటిమట్టం ఉంటేనే చెన్నైకి సరఫరా సజావుగా సాగుతుందని తెలిపింది. రాష్ట్రానికి సాగునీటి ప్రణాళిక ఖరారు చేశాక తమిళనాడుకు ప్రస్తుతం తాగునీటి అవసరాలు తీర్చడానికి చర్యలు తీసుకుంటామని ఏపీ వివరించింది. తెలంగాణ శ్రీశైలం నుంచి విద్యుదుత్పత్తి ద్వారా నాగార్జునసాగర్‌కు నీటిని వదులుతుండటంతో చెన్నైకి నీటి విడుదల అనుకున్నంత స్థాయిలో సాధ్యం కాదని పేర్కొనగా.. ఈ సమావేశంలో ఆ అంశం ప్రస్తావన రాకూడదని దీనిపై ఇప్పటికే తెలంగాణకు తెలియజేశామని బోర్డు ఛైర్మన్ పరమేశం తెలిపారు. ఈ భేటీలో బోర్డు సభ్య కార్యదర్శి మీనా, ఏపీ ఈఎన్‌సీ నారాయణరెడ్డి, సీఈలు మురళీనాథ్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, తెలంగాణ సీఈ కోటేశ్వరరావు, కేంద్ర జల సంఘం, ఇతర రాష్ట్రాల ఇంజినీర్లు పాల్గొన్నారు.