కృష్ణా కదనరంగంలో గెలిచేదెవరు..? ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డు బెజవాడ... రాష్ట్ర రాజకీయాలకు అడ్డా...! దేశ స్వాతంత్రోద్యమం నుంచి.. జాతీయ రాజకీయం వరకూ.. అన్నింటా జెండా ఎగరేసిన జిల్లా.. ! సామాజిక, రాజకీయ చైతన్యం ఎక్కువుగా ఉండే కృష్ణా జిల్లాలో మామూలు రోజుల్లోనే రాజకీయం రంజుగా ఉంటుంది. ఇక ఎన్నికల సమయంలో చెప్పేదేముంటుంది...? వేసవి ఎన్నికల ముంగిట.. కృష్ణా రాజకీయం సెగలు కక్కుతోంది. రాష్ట్ర రాజకీయ రాజధానిలో జెండా ఎగరేయడం.. ఏ రాజకీయ పక్షానికైనా ప్రతిష్టాత్మకమే. కిందటి ఎన్నికల్లో దూసుకెళ్లిన సైకిల్‌కు బ్రేకులెయ్యాలని ప్రతిపక్షం ప్రయత్నాలు చేస్తోంది. రెండు పార్టీల పోరులో తమకేమైనా...ఛాన్స్ ఉంటుందా అని .. జనసేన ఎదురుచూస్తోంది.
16 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్న ఇక్కడ కిందటి ఎన్నికల్లో తెదేపా పైచేయి సాధించింది. కానీ ఎన్నికల వేళ మారుతున్న సమీకరణాలు ఉత్కంఠకు దారితీస్తున్నాయి. 2014లో భాజపాతో కలిసి పోటీ చేసిన తెదేపా...10 అసెంబ్లీతో పాటు రెండు ఎంపీ స్థానాల్లో పసుపు జెండా ఎగరేసింది. ఒక్క స్థానంలో భాజపా గెలవగా.. ఐదు స్థానాలు వైకాపా ఖాతాలోకి వెళ్లాయి. వీరిలో ఇద్దరు ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కారు. ముగ్గురు సభ్యులున్నప్పటికీ అధికార పార్టీకి భారీగా గండి కొట్టాలనే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీ పావులు కదుపుతోంది. గెలుపోటములను శాసించేది జనసేననే అంటూ పవన్ పార్టీ ముందుకెళ్తుడటం...జిల్లా రాజకీయాన్ని మరింత వేడెక్కిస్తోంది.
తెలుగుదేశం పార్టీ ముఖ్యనేత.. మంత్రి దేవినేని ఉమ.. మరోసారి మైలవరంలో సత్తాచాటాలని చూస్తున్నారు. ఈసారి వసంత కృష్ణ ప్రసాద్ ను రంగంలోకి దింపేందుకు ప్రతిపక్ష పార్టీ సిద్ధమైంది. మరో మంత్రి కొల్లు రవీంద్ర ప్రాతినిధ్యం వహిస్తున్న మచిలీపట్నంలోనూ పోటీ ఆసక్తికరంగా ఉంది. ఈసారి ఎన్నికల్లోనూ ఆయన నిలిబడటం దాదాపు ఖాయం. దశాబ్దాల కలగా ఉన్న మచిలీపట్నం పోర్టు పనులు ప్రారంభించటం ఆయనకు అత్యంత అనుకూలించే అంశంగా కనిపిస్తోంది. వైకాపా నుంచి కిందటిసారి పోటీ చేసి ఓడిన మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని తిరిగి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. జనసేన కూడా ఈ నియోజకవర్గంపై కన్నేసింది.
అవనిగడ్డ నుంచి ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ బరిలో నిలిచేలా కనిపిస్తోంది. ప్రతిపక్ష పార్టీ నుంచి ఇంకా అభ్యర్థిని తేల్చలేదు. కిందటి ఎన్నికల్లో తెదేపా గెలిచిన పెడన స్థానం నుంచి తెదేపా అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. అప్పుడు వైకాపా అభ్యర్థి బురగడ్డ వేదవ్యాస్ పై గెలిచిన కాగిత వెంకట్రావుకు ఇప్పుడు టికెట్ ఇచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. వేదవ్యాస్ తెదేపాలో చేరి ముడా ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ స్థానం నుంచి కాగిత... వేదవ్యాస్ ఇద్దరూ..తమ కుమారులను బరిలోకి దించేందుకు ప్రయత్నిస్తున్నారు. వైకాపా నుంచి జోగి రమేష్ పోటీ చేయనున్నారు.
విజయవాడ నగర పరిధిలో ఉన్న పెనమలూరు స్థానం నుంచి 2014 తెదేపా తరపున గెలిచిన బోడె ప్రసాద్ మరోసారి పోటీచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ స్థానంలో చంద్రబాబు కుటుంబం నుంచి ఒకరిని పోటీ చేయించవచ్చనే ప్రచారం జరుగుతోంది. పెనమలూరు నుంచి వైకాపా తరపున మాజీ మంత్రి పార్థ సారథి పోటీ చేయనున్నారు. జిల్లాలో రాజకీయం అత్యంత కీలకమైన నియోజకవర్గం..గుడివాడ. తెదేపాను ప్రతీసారి చిరాకు పెడుతున్న వైకాపా ఎమ్మెల్యే కొడాలి నానిని ఈసారి ఎట్టిపరిస్థితిల్లో ఓడించాలని తెలుగుదేశం పార్టీ గట్టి పట్టుదలతో ఉంది. నాని చేతిలో ఓడిపోయిన తెదేపా అభ్యర్థి రావి వెంకటేశ్వరరావును.. లేకుంటే పార్టీలోని గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టే ఉద్దేశ్యంతో బీసీ అభ్యర్థిని బరిలోకి దింపే ఆలోచన కూడా చేస్తున్నారు.
ఫ్యాన్ గాలి వీచిన పామర్రులో పోటీ తీవ్రంగానే ఉంది. ఎస్సీ రిజ్వర్డు స్థానమైన పామర్రులో కిందటి ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి వర్ల రామయ్యపై గెలిచిన ఉప్పులేటి కల్పన ఆ తర్వాత తెదేపాలోకి వచ్చేశారు. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేనా.. లేదా వర్లకు మరోసారి టికెట్ ఇస్తుందా అనే విషయంలో స్పష్టత లేదు. వైకాపా తరపున కైల అనిల్‌ను పార్టీ సమన్వయకర్తగా నియమించారు. ఆయన స్థానికేతరుడు కావటం అధికార పార్టీకి కలిసోచ్చేలా కనిపిస్తోంది. కిందటి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ గెలిచిన నూజివీడులో పోటీ చేసేందుకు అన్ని పార్టీల నుంచి అభ్యర్థులుపోటీ పడుతున్నారు. 2014లో తెదేపా అభ్యర్థి ముద్రబోయి వెంకటేశ్వర రావుపై వైకాపా అభ్యర్థి మేకా వెంకట ప్రతాప్ గెలిచారు. ఈ సారి కూడా మళ్లీ వెంకట ప్రతాప్ ను నిలబట్టేందుకు వైకాపా సిద్ధమైంది. తెదేపా తరపున ముద్రబోయిన వెంకటేశ్వరరావునే నిలబెట్టేలా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో వైకాపా తరపున ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిన తోట చంద్రశేఖర్ జనసేనలో చేరారు. నూజివీడు నుంచి టికెట్ ను ఆశిస్తున్నారు.
నందిగామ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న తంగిరాల సౌమ్యనే తెదేపా మళ్లీ పోటీ చేయిస్తోంది. సౌమ్యపై 5వేల ఓట్ల తో ఓడిన మొండి తోక జగన్మోహన రావు తిరిగి వైకాపా తరపున పోటీ చేయనున్నారు. సైకిల్ పరుగు పెట్టిన మరో స్థానం జగ్గయ్యపేటలో తెదేపా అభ్యర్థిగా శ్రీరాం రాజగోపాల్ (శ్రీరాం తాతయ్య) గెలిచారు. వైకాపా తరపున పోటీ చేసి గట్టి పోటీనిచ్చిన సామినేని భానునే మరోసారి అభ్యర్థిగా నిలబెట్టాలని ఫ్యాన్ పార్టీ నిర్ణయించింది. తెదేపా నుంచి మాజీ మంత్రి నెట్టెం రఘురాం టికెట్ కోసం గట్టిగా ప్రయత్నించినా శ్రీరాం తాతయ్యకే తెదేపా టికెట్ ఖరారు చేసింది. 2014 ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైకాపా తరపున జలీల్ ఖాన్ విజయం సాధించారు. అనంతర రాజకీయ పరిణామాలతో తెదేపా గూటికి చేరారు. ఈసారి సైకిల్ పార్టీ తరపున ఆయన కూతురు షబానా బరిలో నిలవటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. వైకాపా తరపున విజయవాడ సెంట్రల్ స్థానాన్ని ఆశించి భంగపడ్డ వంగవీటి రాధా ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. వచ్చే ఎన్నికల్లో రాధా .. ఏపార్టీ నుంచి.. ఏ స్థానం నుంచి పోటీ చేస్తారో అనే విషయంలో స్పష్టత లేదు. వైకాపా గెలిచిన తిరువూరు నుంచి కొక్కిలిగడ్డ రక్షణనిథి.. మళ్లీ పోటీ చేస్తున్నారు. మంత్రి జవహర్ తిరువూరు మండలం గానుగపాడు లో పుట్టారు. అక్కడి నుంచే ఆయనపోటీ చేసేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం. ఈ స్థానాన్ని అశిస్తున్న వారిలో పలువురు ఎన్నారైలు కూడా ఉన్నారు.
జిల్లాలో కమలం వికసించిన కైకలూరు నియోజకర్గంలో కామినేని శ్రీనివాసరావు ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని కామినేని ఇప్పటికే స్పష్టం చేశారు. తెదేపా తరపున మాజీ ఎమ్మెల్యే జయమంగళం వెంకటరమణ టికెట్ ఆశిస్తున్నారు.కిందటి ఎన్నికల్లో ఉప్పాల రాంప్రసాద్ వైకాపా తరపున పోటీ చేసి ఓడారు. భారీ మెజారీటీతో ఓడటంతో ఆయన్ను ఈ సారి పక్కనపెట్టారు. మరో వైకాపా నేత దూళం నాగేశ్వరరావుకు టికెట్ ఖాయమయ్యేలా ఉంది.
విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి తెదేపా తరపున కేశినేని నానినే కొనసాగించాలని తెదేపా నిర్ణయించింది. ఇటీవల వైకాపా తీర్థం పుచ్చుకున్న జై రమేష్ విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం దాదాపు ఖాయమే.
మచిలీపట్నం నుంచి తెదేపా తరపున ఎంపీగా ఉన్న కొనకళ్ల నారాయణరావును కొనసాగిస్తారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. మచిలీపట్నం పార్లమెంట్ స్థానం నుంచి బాలశౌరిని వైకాపా రంగంలోకి దింపింది. విజయవాడ లేదా మచిలీపట్నం ఎంపీ స్థానానికి భాజపా నుంచి పురంధేశ్వరి రంగంలోకి దింపొచ్చనే ప్రచారం జరుగుతోంది. జనసేన అభ్యర్థులు పై స్పష్టత రావాల్సి ఉంది. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటానన్న లగడపాటి రాజగోపాల్...తిరిగి రాజకీయపునరాగమనం చేస్తారనే చర్చ కూడా జరగటం బెజవాడ రాజకీయంలోమరో విశేషం.
ఈ ఐదేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో మరోసారి జిల్లాపై ఆధిపత్యం సాధించేందుకు పసుపు పార్టీ వ్యూహాలు రచిస్తుంటే... ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు సహా జగన్ చరిష్మా తమకు అధికారం కట్టుబెడుతుందని వైకాపా నేతలు ధీమాగా ఉన్నారు. బలమైన నేతలను రంగంలోకి దింపి కొన్ని స్థానాల్లోనైనా పాగా వేసేలా జనసేన వ్యూహాలు రచిస్తోంది.