స్వగ్రామానికి సేవ చేయాలనుకున్న ప్రవాసాంధ్రుడు కాశీనాథుని సాంబశివరావు సంకల్పమే కేడీబీ ఛారిటబుల్ ట్రస్టు. సరిగా కూర్చోలేని, మాట్లాడలేని, తమ పనులు తామే చేసుకోలేని మానసిక దివ్యాంగులకు ఉచితంగా ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ వంటి చికిత్సలు అందిస్తున్నారు. భవిష్యత్తులో.. ఇతరులపై ఆధారపడి జీవించకుండా వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇప్పిస్తున్నారు. పుట్టుకతోనే మానసిక పరిస్థితి సరిగా లేని తమ పిల్లలకు ఇస్తున్న శిక్షణా తరగతులు.. ఎంతగానో ఉపయోగపడుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందిస్తున్నారు.
సమాజంలో తోటివారికి సహాయపడాలనే అలోచన అందరికీ ఉన్నా... ఆ అవకాశాన్ని భగవంతుడు కొందరికే ఇస్తాడని... ఆ కొందరిలో తాము ఉన్నామని.. ఇక్కడి ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి సుమారు 60 మందికి పైగా పిల్లలు ఇక్కడ శిక్షణ పొందేందుకు వస్తుంటారన్నారు. థెరపీ, కంప్యూటర్, కల్చరల్ విభాగాల్లో క్లాసులు నిర్వహిస్తున్నారు.