ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దివిసీమ కరకట్టకు బీటలు... భయాందోళనలో ప్రజలు

నదీ తీరంలో నివసించే అక్కడి ప్రజలకు ఆ కరకట్టే అభయహస్తం. పెను ఉప్పెనల నుంచి ఏకైక రక్షణ. అయితే ఆ రక్షణ ఏర్పాటుకే ముప్పొచ్చి పడింది. ఎక్కడికక్కడ బీటలు వారి స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది.

By

Published : Oct 14, 2019, 6:19 AM IST

కరకట్ట

దివిసీమ కరకట్టకు బీటలు... భయాందోళనలో ప్రజలు

వరద ఉప్పెనల నుంచి రక్షణ కోసం కృష్ణా జిల్లా దివిసీమలో ఏర్పాటు చేసిన కరకట్టలో భద్రత లోపించిన పరిస్థితులు స్థానికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాల్లోని పలు గ్రామాలకు తుపాన్ల సమయంలో కృష్ణా నది వరదలు, సముద్రం ముంపు నుంచి రక్షణ కోసం దివిసీమ చుట్టూ 20 అడుగుల ఎత్తులో మట్టి కరకట్ట నిర్మించారు. అయితే గుల్లలమోద గ్రామం నుంచి ఉల్లిపాలెం వరకు సుమారు 40 కిలోమీటర్ల మేర పలు చోట్ల మట్టి కరిగిపోయి కరకట్ట శిథిలావస్థకు చేరింది. 6 అడుగుల మేర గుంటలు, బీటలతో ఎప్పుడు ప్రమాదం ముంచుకొస్తుందో తెలీని పరిస్థితి నెలకొంది. ఉల్లిపాలెం వద్ద గత నెలలో కృష్ణా నదికి వచ్చిన వరదలతో కరకట్ట సగానికి పైగా కోసుకుపోయింది. నది కోతకు గురైన చోట ఇసుక బస్తాలు వేసి తాత్కాలిక చర్యలు చేపట్టి వదిలేశారు.

1977వ సంవత్సరంలో దివిసీమలో వచ్చిన పెను ఉప్పెనకు వేలమంది ప్రజలు మృత్యువాత పడ్డారు. గ్రామాలకు గ్రామాలే కొట్టుకుపోయాయి. 1999 సంవత్సరంలోనూ కృష్ణానది వరదతో 10 లక్షల క్యూసెక్కుల వరద దివిసీమను చుట్టుముట్టింది. సదా ఇంతటి ముప్పు పొంచి ఉండే దివిసీమలో కరకట్ట భద్రతపై ఉపేక్ష సరికాదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.జలవనరుల అధికారులు కరకట్టకు తక్షణమే మరమ్మతులు చేయించి, ముప్పు నివారించాలని దివిసీమ ప్రజలు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details