సింగపూర్ తెలుగు సమాజం, త్యాగయ్య టీవీ సంయుక్తంగా సింగపూర్ ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ ప్రాంగణంలో అంతర్జాతీయ సంగీత, నృత్య పోటీల బహుమతుల ప్రధానోత్సవం 2019 నిర్వహించింది. ఈ కార్యక్రమం సింగపూర్ వాసులను మంత్ర ముగ్ధులను చేసింది. 150 మందికిపైగా కళాకారులు పాల్గొని తమ కళానైపుణ్యంతో ఆహూతులను కట్టిపడేశారు. శాస్త్రీయ సంగీత, శాస్త్రీయ నృత్య పోటీలు, కళామహోత్సవంతో కళాభిమానులు తన్మయంతో పులకరించిపోయారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ కర్ణాటక సంగీత విధుషీమణి, నేపథ్య గాయని డాక్టర్ నిత్యశ్రీ మహదేవన్, నాట్యాచార్య డాక్టర్ కృష్ణకుమార్ పాల్గొన్నారు.
శాస్త్రీయ సంగీత విశేషాలను, ఆవశ్యకతను నిత్యశ్రీ వివరించారు. ఇంతమంది కళాకారులకు సింగపూర్ లాంటి మహానగరంలో అంతర్జాతీయస్థాయిలో వేదిక కల్పించి వారి నైపుణ్యాన్ని బాహ్య ప్రపంచానికి చూపించే అవకాశం కల్పించిన సింగపూర్ తెలుగు సమాజం, త్యాగయ్య టీవీలను ప్రత్యేకంగా అభినందించారు. శాస్త్రీయ నృత్య విశేషాలను, ప్రాముఖ్యతను, మహావిద్వాంసులు శ్రీ త్యాగరాజు జీవిత విశేషాలను కృష్ణకుమార్ వివరించారు. అన్నమాచార్య కీర్తనలకు ఆయన శిష్యబృందం ప్రదర్శించిన నృత్యప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.