ఇప్పుడంటే మీరు నన్ను విటమిన్ 'ఎ' అని పిలుచుకుంటున్నారు గానీ మొదట్లో నాకు ఏ పేరూ లేదు! అప్పుడెప్పుడో 1816లో ప్రాంకోయిస్ మ్యాగెండీ అనే డాక్టర్... కుక్కలు త్వరగా చనిపోవటానికి, వాటి కంట్లోని కార్నియాలో పుండ్లకు ఒక పోషకం కారణమవుతోందని అనుమానించాడు. 1912లో ఫ్రెడెరిక్ గోలాండ్ హాప్కిన్స్ అనే శాస్త్రవేత్త పాలలో పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వులే కాకుండా ఎలుకలు పెరగటానికి తోడ్పడే కొన్ని పోషకాలేవో ఉన్నాయని గుర్తించాడు. దీన్ని కనుగొన్నందుకు ఆయనకు 1929లో నోబెల్ బహుమతీ వచ్చింది. ఆ తర్వాత ఈ పోషకాల్లో ఒకదాన్ని నేనేనని ఎల్మర్ మెక్‌కోలమ్, మార్గరెట్ డవిస్ గుర్తించారు. మొదట్లో నన్ను ‘కొవ్వులో కరిగే పోషకం’ అనేవారు. 1920లో విటమిన్ 'ఎ' అని పిలుస్తున్నారు.
క్యారెట్లు తింటే చీకట్లో కళ్లు బాగా కనిపిస్తాయని వినే ఉంటారు. ఈ ప్రచారం వెనక చిత్రమైన కథే ఉంది. రెండో ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు జర్మనీ సైనికులు బ్రిటిష్ వాళ్ల కళ్లు కప్పేందుకు రాత్రిపూట విమానాల నుంచి బాంబులు వేసేవారు. విటమిన్ 'ఎ' దండిగా ఉండే క్యారెట్లు ఎక్కువగా తినటం వల్లనే అలా చేయగలిగారని పత్రికల్లో వార్తలు వచ్చాయి. దీంతో క్యారెట్లు తింటే చీకట్లో కళ్లు బాగా కనిపిస్తాయనే ప్రచారం వ్యాపించింది.
అవడానికి నేను ఒక్కటే కావొచ్చు. కానీ రెటినోల్, రెటినోయిక్ ఆమ్లం, రెటినల్, బీటా కెరటిన్ వంటి కెరొటినాయిడ్లు.. ఇలా వివిధ రూపాల్లో ఉంటాను. కొవ్వులో తేలికగా కరిగిపోతాను. మీకు కళ్లు బాగా కనిపించటంలో నా పాత్రే చాలా ఎక్కువ. రెటినల్ రూపంలో మీ కంట్లో ఓప్సిన్ అనే ప్రోటీన్‌తో కలిసిపోయి రాడాప్సిన్‌గా మారిపోతాను. దీని ద్వారా రకరకాల రంగులు, మసక చీకటిలో దృశ్యాలు కనిపించేలా చేస్తాను. ఇంకా ఎముకల జీవక్రియలో పాల్గొంటూ అస్థి పంజరం ఎదిగేలా చేస్తాను. జిగురు పొరలు ఆరోగ్యంగా ఉండటానికి, జన్యువులు పని చేయటానికి తోడ్పడతా. మీ చర్మం నిగనిగలాడటానికి, దంతాలు దృఢంగా ఉండటానికీ ఉపయోగపడతాను. అంతేనా? రోగనిరోధక శక్తినీ బలోపేతం చేస్తాను. ముఖ్యంగా రోగనిరోధక కణాల్లో భాగమైన 'టి' కణాల వృద్ధికి తోడ్పడతాను. ఇలా ఇన్‌ఫెక్షన్ల బారినపడకుండా కాపాడతాను. అందుకే నన్ను యాంటీఇన్‌ఫెక్షన్ విటమిన్ అనీ అంటుంటారు.