ఇసుకాసురుల ధనదాహానికి మరో ఇద్దరు విద్యార్థులు బలి Illegal Sand Mining: పదో పతరగతి పరీక్షల ఫలితాల్లో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులైన ఆనందంలో ఉన్న నలుగురు విద్యార్థులు.. విజయవాడ నగరం పక్కనే ఉన్న యనమలకుదురు సమీపంలో కృష్ణా నదిలోకి వెళ్లారు. నడుచుకుంటూ ఆవలి ఒడ్డుకు వెళ్తున్నారు. అదే సమయంలో ఇద్దరు విద్యార్థులు ఆకస్మాత్తుగా పెద్ద గుంతలో పడిపోయారు. అంతే వెంటనే మునిగిపోయారు. మిగిలిన ఇద్దరు భయపడి వెనుదిరిగి వచ్చారు. గల్లంతైన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు మంగళవారం లభ్యమయ్యాయి. అక్కడ అంతపెద్ద గుంతకు కారణం ఇసుక తవ్వకాలు.
వాస్తవానికి అక్కడ ఇసుక తవ్వకాలకు అనుమతి లేదు. కానీ యనమలకుదురు వైపు నుంచి గుంటూరు జిల్లా తాడేపల్లి వైపు నుంచి ట్రాక్టర్లలో జేసీబీలు పెట్టి తవ్వకాలు జరిపారు. ఆ గుంతల్లో పడి ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ఈ ప్రదేశం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి అతి సమీపంలో ఉంటుంది. సరిగ్గా గత ఏడాది డిసెంబరులో ఇలాంటి సంఘటనే జరిగింది. సీఎం క్యాంపు కార్యాలయానికి సమీపంలోనే.. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. కృష్ణా నదిలోకి ఈతకు వెళ్లిన ఏడుగురు స్నేహితులు నీటిలో మునిగిపోయారు. వారిలో అయిదుగురు మృత్యువాత పడ్డారు. వీరంతా ఏడు, ఎనిమిది తరగతులు చదువుతున్న విద్యార్థులు. ఇసుకాసురుల కాసుల కక్కుర్తి ఇలా పలువురికి గర్భశోకం మిగిల్చింది.
కొత్తగా కారు కొన్న ఆనందంలో ముగ్గురు యువకులు కృష్ణా నది ఒడ్డుకు చేరుకున్నారు. వారంతా ఈత వచ్చిన వారే. అయితే వారు నదిలో స్నానానికి దిగి.. నీటిలో మునిగిపోయి మృత్యువాత పడ్డారు. విజయవాడ నగరం సమీపంలోని చోడవరంలో ఈ సంఘటన ఈ ఏడాది మార్చి నెలలో జరిగింది. ఇసుక తవ్వకాల వల్ల ఏర్పడిన గుంతలో ఈతకు దిగిన ఆ ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోగా.. పోలీసులు మాత్రం మద్యం మత్తులో నీటిలో పడ్డారని రికార్డుల్లో రాశారు.
ఇలాంటి సంఘటనలు ఇక్కడ తరచూ జరుగుతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వారే కాదు.. ఉమ్మడి గుంటూరు జిల్లా వాసులు కూడా ఇలా మృత్యువాత పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం.. ఇసుకాసురులు కృష్ణమ్మ నదిని చెరబట్టడమే. నిబంధనలకు విరుద్దంగా.. అనధికారికంగా యంత్రాలు పెట్టి.. తాటిచెట్లంత లోతుల్లో కొన్ని లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వేస్తున్నారు. కాగా.. ఈ గుంతల్లో అమాయకులు పడి ప్రాణాలు కోల్పోతున్నారు.
గత ఆరు నెలల్లో ఒక్క కృష్ణా జిల్లాలోనే ఇలా 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో అయితే 76 మంది ఇసుక గుంతల్లో పడి ప్రాణాలు వదిలారు. యనమలకుదురు నుంచి చోడవరం వరకు 23 మంది, చోడవరం నుంచి మద్దూరు వరకు ఏడుగురు, తోట్లవల్లూరులో 20మంది మూడేళ్లలో చనిపోయారు. జగ్గయ్యపేట మండలంలో ముగ్గురు, చందర్లపాడులో 8మంది, ఇబ్రహీంపట్నంలో ఆరుగురు, కంచికచర్లలో ముగ్గురు, పెనుగంచిప్రోలులో 5గురు మృత్యువాత పడ్డారు. కంచికచర్లకు చెందిన ఇంజినీరింగ్ ముగ్గురు విద్యార్థులు నదిలో ఈతకు దిగి మృత్యువాత పడ్డారు. ఒక విద్యార్థి మృతదేహం.. బ్యారేజీ వద్ద లభించింది.
నిబంధనలు బేఖాతరు!: బ్యారేజీల సమీపంలో, వంతెనల సమీపంలో ఇసుక తవ్వకాలకు అనుమతి లేదు. అయినా కూడా విజయవాడ ప్రకాశం బ్యారేజీ దిగువున, కనకదుర్గ వారధి సమీపంలో సీఎం క్యాంపు కార్యాలయానికి, రాష్ట్ర కార్యాలయాలకు కూతవేటు దూరంలో తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక్కడ రేవులకు అనుమతి లేదు. నగరానికి సమీపంలో ఉండటంతో జేసీబీలు పెట్టి మరీ ట్రాక్టర్ల ద్వారా రవాణా చేస్తున్నారు. నదిలో ఇసుక తవ్వకాలకు యంత్రాలు వినియోగించకూడదు. ఇది పర్యావరణానికి విఘాతం. అయినా కూడా జేసీబీ, ప్రొక్లెయిన్‌లు పెట్టి 10 నుంచి 20 మీటర్ల లోతు తవ్వుతున్నారు.
ఈ క్రమంలో ఎక్కడా కూలీలను వినియోగించడం లేదు. అనుమతులు ఉన్న రేవులకు జియో కో ఆర్డినేట్ ద్వారా సరిహద్దులు నిర్ణయిస్తారు. ఎరుపు రంగు జెండాలను పాతుతారు.. ఇవి అమలు కావడం లేదు. నది మధ్యలో తవ్వకాలు చేస్తున్నారు. అనధికారికంగా నదిలోనే రహదారులు ఏర్పాటు చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఇసుక కాంట్రాక్టు తీసుకున్నారు. ఆయన తరఫున కంచికచర్ల మండలం వైసీపీ నాయకుడు తవ్వకాలు పర్యవేక్షిస్తున్నారు.
ఇక్కడ ఒక్క రేవుకు కూడా కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతి లేదు. గుంటూరు జిల్లాలో కొంత భాగాన్ని వైసీపీ ఓ నియోజకవర్గ ఇంఛార్జికి అప్పగించారు. మరికొంత భాగంలో గుంటూరు జిల్లాకు చెందిన నేతలు తవ్వకాలు జరుపుతున్నారు. సీఎం నివాసానికి అతి సమీపంలో ఈ తవ్వకాలు జరగడం గమనార్హం. ఇక్కడ తవ్వకాలు చేసిన ఇసుకను హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. కోట్ల రూపాయలలో వ్యాపారం చేస్తున్నారు. నెలకు కృష్ణా జిల్లా నుంచి రూ.18 కోట్లు, గుంటూరు జిల్లా నుంచి రూ.20 కోట్లు కప్పం చెల్లించేందుకు అంగీకారం కుదిరిందని అధికార వర్గాల్లోనే వినిపిస్తోంది.
ఈ మధ్య కాలంలో విజయవాడ హైదరాబాద్‌కు వెళ్లే వాహనాల్లో అత్యధికం లారీలే ఉన్నాయి. టోల్ ప్లాజాల వద్ద ఈ వివరాలు ఉన్నాయి. తెలంగాణలో అధిక బరువు చలానాలు ఇసుక లారీలవే. ఎన్‌జీటీ హెచ్చరించినా..! కృష్ణా నదిలో ప్రమాదాలపై 'ఈనాడు'లో వచ్చిన కథనాల ఆధారంగా ఎన్‌జీటీ సుమోటోగా కేసు నమోదు చేసి విచారించింది. దీనిపై కృష్ణా జిల్లా అధికారులను నివేదిక కోరింది. అయితే.. 'అబ్బే ఆ మరణాలు ఇసుక తవ్వకాల వల్ల జరిగినవి కావు' అంటూ.. కల్లబొల్లి కబుర్లతో అధికారులు నివేదిక ఇచ్చి చేతులు దులుపుకున్నారు.
ఉపశమనం కోసం రక్షణ చర్యలు తీసుకుంటున్నామని, కంచెలు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తామని ఎన్‌జీటీకి హామీ ఇచ్చారు. కానీ అలాంటి చర్యలు తీసుకోవడం లేదు సరికదా.. ఇసుక తవ్వకాలపై అధికారులకు సమాచారం ఇచ్చినా వచ్చి చర్యలు తీసుకొనే పరిస్థితే లేదు. మునేరులో తవ్వకాలపై స్వయంగా ఎస్‌ఈబీ సీఐ ఇచ్చిన ఫిర్యాదునే నందిగామ పోలీసులు బుట్టదాఖలు చేశారు. ఇసుకాసురుల ధన దాహానికి పలువురు యువకులు బలవుతున్నారు. కృష్ణా నదికి, యువకుల తల్లులకు గర్భశోకాన్ని మిగుల్చుతున్నారు.
ఇవీ చదవండి: