నేను పార్టీ మారటం లేదు: మంత్రి పితాని
తాను వైకాపాలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని మంత్రి పితాని స్పష్టం చేశారు. కొన్ని ఛానళ్లు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.
తాను వైకాపాలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు మంత్రి పితాని. వైకాపా ప్రేరణతోనే కొన్ని ఛానళ్లు తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. 9 నెలల నుంచి తనపై దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పత్రికల్లో వార్తలను చూసే ముఖ్యమంత్రి తనను పిలిచారని, తాను పార్టీ మారే ప్రసక్తే లేదని చంద్రబాబుకు తెలిపానని వివరించారు. తనపై ఆరోపణలు చేసేవారు ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు. వ్యక్తిగతంగా ఎవరికీ నష్టం కలిగించకూడదనే మీడియా ముందుకు వచ్చానని తెలిపారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజలు తనను ఆశీర్వదిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.