కృష్ణా జిల్లా అవనిగడ్డ శివారులో.. కృష్ణా నది కరకట్ట దిగువన ఉన్న ప్రాంతంలో పేదలకు ఇళ్లస్థలాల కేటాయింపుపై.. ఆందోళన వ్యక్తమవుతోంది. పాత ఎడ్లలంక, పల్లెపాలెం ప్రాంతాల్లో ప్రభుత్వం నివేశన స్థలాల కోసం మామిడి తోటలున్న సాగు భూములు కొనుగోలు చేసింది. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ భూముల్లోకి పెద్దఎత్తున వరద నీరు పోటెత్తడం ఇప్పుడు ఆందోళనకు గురిచేస్తోంది. సుమారు 20 ఎకరాల్లో 800 మంది ఇళ్లస్థలాలు ముంపునకు గురయ్యాయి. కృష్ణా నదికి కేవలం 800 మీటర్ల దూరంలో కరకట్టకు లోపలి వైపు స్థలాలు ఇవ్వడంపై పేదలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దివిసీమ లాంటి ప్రాంతాల్లో.. వోల్టా, కోస్టల్ చట్టాలకు విరుద్ధంగా ప్రభుత్వం స్థలాలు కేటాయిస్తే లబ్ధిదారులు భవిష్యత్తులో ఇబ్బందిపడతారని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కృష్ణానదిలో ఉప్పునీటి శాతం ఎక్కువగా ఉన్నందున.., వరదలొస్తే భవనాలకు ఎక్కువకాలం మన్నిక ఉండదన్నారు. ఈ విషయంపై ఇప్పటికే సీఎం జగన్ సహా మంత్రులు, కలెక్టర్‌కు లేఖలు రాసినా ఫలితం లేదన్నారు. కృష్ణా నదిలో వరదొచ్చిన ప్రతిసారి.. సుమారు వంద మీటర్ల మేర ఒడ్డు కొట్టుకుపోతోంది. అందువల్ల ఈ ప్రాంతంలో ఇళ్లస్థలాల కేటాయింపుపై ప్రభుత్వం పునరాలోచించాలని కోరుతున్నారు.