దేశంలో ఎక్కడా లేని విధంగా పేద ప్రజల అవసరాలను అర్థం చేసుకుని వారికి కావాల్సిన మౌలిక వసతులను ఏర్పాటు చేయడంలో ముఖ్యమంత్రి జగన్ ముందు వరుసలో ఉన్నారని కృష్ణా జిల్లా కంకిపాడులో జరిగిన ఇళ్ల పట్టాల కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పేదవారి మనోగతాన్ని అర్థం చేసుకున్న సీఎం అని కొనియాడారు. గతంలో అధికారం చేపట్టిన అనేక మంది ముఖ్యమంత్రులు తమ రాజకీయ లబ్ధి కోసం పని చేస్తే.. జగన్ మాత్రం ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు కట్టుబడ్డారన్నారు.
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకోవడంతోనే సరిపోతోందని.. ప్రజలకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. మూడు పర్యాయాలు పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే అవకాశం వచ్చినా ఆయన చేయలేకపోయారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులందరికీ ఒకేసారి పార్టీలకతీతంగా ఇళ్ల స్థలాలు కేటాయించడం చరిత్రలో ఇదే తొలిసారని ముఖ్యఅతిథి ఎంపీ బాలశౌరి అన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా కీర్తి చరిత్రలో చిరస్థారని జగన్ను కొనియాడారు.