'గుంటూరు'.. పోటీలో ఎవరు?
గుంటూరు జిల్లాలోని ఐదు అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల ఎంపికపై తెదేపా అధినేత చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఓ సారి నేతలతో సమావేశమైన చంద్రబాబు... రేపు మరోసారి సమీక్షించనున్నారు.
గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ, తాడికొండ, ప్రత్తిపాడు, మంగళగిరి శాసనసభ నియోజకవర్గాల పరిధిలోని తెదేపా నేతలతో అధినేత చంద్రబాబు సమీక్షించారు. సార్వత్రిక ఎన్నికలకు అభ్యర్థుల ఖరారుపై చర్చించారు. ఇప్పటి వరకు గుంటూరు ఎంపీ అభ్యర్థిగా గల్లా జయదేవ్, తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆలపాటి రాజా, పొన్నూరు అభ్యర్థిగా ధూళిపాళ్ల నరేంద్ర పేర్లు దాదాపు ఖరారు చేశారు. తాడికొండ రేసులో సిట్టింగ్ ఎమ్మెల్యేగా శ్రవణ్ కుమార్ ఉండగా.... ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్, బాపట్ల ఎంపీ మాల్యాద్రిలు ఈ టిక్కెటును ఆశిస్తున్నారు. ప్రత్తిపాడు రేసులో వీరయ్యతో పాటు ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంగళగిరి స్థానం కోసం గంజి చిరంజీవి, మురుగుడు హనుమంతరావు, తిరివిదుల శ్రీనివాసరావు మధ్య పోటీ నెలకొంది. గుంటూరు పశ్చిమ స్థానానికి కోవెలముడి రవీంద్ర, చందు సాంబశివరావు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. గుంటూరు తూర్పు రేసులో సినీనటుడు అలీతో పాటు మహబూబ్ షరీఫ్, షేక్ షౌకథ్ ఉన్నట్టు తెలుస్తోంది. పూర్తి స్థాయి స్పష్టత ఇచ్చే దిశగా.. రేపు మరోసారి నాయకులతో భేటీ అయ్యేందుకు తెదేపా అధినేత చంద్రబాబు నిర్ణయించారు.