రోగులకు అందుబాటులో...431 అత్యవసర ఔషధాలు అత్యవసర ఔషధాల జాబితా ప్రకారం మందుల కొనుగోళ్లకు వైద్యశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం 320 మందులకు అదనంగా మరో 431 రకాల మందులను 45 రోజుల్లోగా ప్రభుత్వ ఆసుపత్రులకు సరఫరా చేసేందుకు ఆదేశాలు జారీఅయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరతను క్రమేపి తగ్గిస్తామని వైద్యశాఖ అధికారులు హామీ ఇస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 751 రకాల మందులను రోగులకు అందుబాటులో ఉంచాలని గతేడాది డిసెంబర్లో వైద్యనిపుణుల కమిటీ సూచించింది. సాధారణంగా వినియోగించే ఔషధాలతో పాటు సూపర్ స్పెషాలిటీ వైద్యులు రాసే మందులు అందుబాటులో ఉంచనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 320 రకాల ఔషధాలు మాత్రమే ఉన్నందున రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మిగిలిన మందుల కొనుగోళ్ల కోసం టెండర్లను ఆహ్వానించారు. 90 కోట్ల రూపాయల ఖర్చుతో మందులు కొనుగోలు చేసేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. ఔషధాల జారీ విషయంలో ఆసుపత్రి సిబ్బంది ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే..వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.