మద్య నిషేధం దిశగా అడుగులు... త్వరలో సర్కార్ షాపులు ప్రభుత్వ మద్యం షాపులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. రెన్యువల్‌కు నోచుకోని మద్యం దుకాణాలను ప్రభుత్వమే ప్రారంభిస్తుంది. సెప్టెంబరు 1 నుంచి కృష్ణా జిల్లాలో 28 షాపులు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో మొత్తం 344 మద్యం దుకాణాలు ఉన్నాయి. 2019 - 20 సంవత్సరానికి ప్రభుత్వ విధానంలో భాగంగా 20 శాతం దుకాణాలను తగ్గించారు. ఈ మేరకు 275కు కుదించారు . కొత్త విధానం అక్టోబరు1 నుంచి అమలులోకి రానుంది. జిల్లాలో 52 దుకాణాలను లైసెన్సుదారులు పునరుద్ధరించుకునేందుకు ఆసక్తి చూపలేదు. తొలి విడతలో వీటిని ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు . ఇందుకు గాను షాపులు నడిపేందుకు అద్దె ప్రాంగణాల కోసం దరఖాస్తులు ఆహ్వానించారు . సంయుక్త కలెక్టర్ ఆధ్వర్యంలో అద్దెలను ఖరారు చేశారు. రెన్యువల్ కాని 52 దుకాణాలలో సరైన ప్రాంగణాలు దొరికినవి అద్దె ఖరారైనవి 32 వరకు తేలాయి . ఇందులో నాలుగు దుకాణాలకు సంబంధించి సమస్యలు తలెత్తాయి. చివరకు విజయవాడ ఈఎస్ పరిధిలో 9 , బందరు ఈఎస్ పరిధిలో 19 దుకాణాలు ప్రారంభం కానున్నాయి . మిగిలినవి అక్టోబరు నుంచి మొదలవుతాయి.
అద్దె లేకుండా దుకాణాలు
మద్యం దుకాణంలో మౌలిక వసతులను కల్పించే బాధ్యత యజమానిదే. అందులో ఓ ఫ్రిజ్, అరలు, ఫ్యాను వంటివాటిని కూడా అందజేయాలి . ఈ అంశాలను ఒప్పందంలో పొందుపర్చారు. మొదటి విడతతో పాటు రెండో దశలో ఏర్పాటు అయ్యే వాటికి కూడా అద్దె ఒప్పందాలు అయ్యాయి. విజయవాడ నగరంలో 60 వేల నుంచి అత్యధికంగా రూ 70 వేల వరకు అద్దె పలికింది. ఎవరి నుంచి అయినా అభ్యంతరాలు వచ్చి , అవి సహేతుకుగా ఉంటే ఆపై ఒప్పందాన్ని ఎప్పుడైనా రద్దు చేసుకునే వెసులుబాటును పొందుపర్చారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఎనిమిది దుకాణదారులు పైసా అద్దె తీసుకోకుండా ఉచితంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు . నందిగామలో ఐదు, పెనుగంచిప్రోలు, ఊటుకూరు, గంపలగూడెం, పెనుగంచిప్రోలులో ఒక్కొ దుకాణం ఉచితంగా వచ్చాయి.
పక్కాగా ఏర్పాట్లు
ప్రభుత్వ మద్యం దుకాణాల నిర్వహణను బేవరేజెస్ కార్పొరేషన్ చూస్తోంది. సంబంధిత డిపో మేనేజర్లు వాటిని పర్యవేక్షిస్తున్నారు. పట్టణాల్లో ముగ్గురు సేల్స్‌మెన్లు, గ్రామాల్లో అయితే ఇద్దరు చొప్పున ప్రతి దుకాణంలో ఉంటారు . వీరిపై ప్రతి షాపునకు ఓ సూపర్ వైజర్ ఉంటారు. సెక్యూరిటీ గార్డు కూడా విధులు నిర్వహిస్తారు. వీరు ఒకటో తేదీ నుంచి విధుల్లో ఉంటారు. దుకాణాలలో అమ్మకాల వివరాలను నమోదు చేసే సాఫ్ట్‌వేర్‌ను ఏపీ ఆన్లైన్ రూపొందిస్తోంది . ప్రతి దుకాణంలో కొత్త ఉద్యోగులు అలవాటు అయ్యే వరకు ఎక్సైజ్ కానిస్టేబుల్ పర్యవేక్షిస్తారు. దుకాణాల్లో అవసరమయ్యే నగదు లెక్కింపు యంత్రం, నకిలీ నోట్లను గుర్తించే పరికరం , డబ్బు దాచుకునేందుకు కరెన్సీ చెస్ట్‌లను అధికారులు కొనుగోలు చేశారు. ప్రతి రోజూ నగదును సమీపంలోని బ్యాంకు సిబ్బంది వచ్చి తీసుకెళ్తారు. సెలవు దినాల్లో అయితే దాచుకునేందుకు లాకర్‌ను ఉపయోగించుకుంటారు .