కైకలూరు.. కృష్ణాజిల్లా విజయవాడ సమీపంలోని చిన్న గ్రామం. వైద్యసేవలు అందాలంటే కష్టమయ్యేది. ప్రసవాలు, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారి చికిత్సకూ విజయవాడో, ఏలూరో వెళ్లాల్సి వచ్చేది. అలా వెళ్తూ మార్గమధ్యలోనే ప్రాణాలు పోయిన ఘటనలూ ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రభుత్వం చొరవతో కైకలూరుకు ఆసుపత్రి వచ్చింది. ఆధునిక వసతులతో 50 పడకలకు విస్తరించారు. అనుభవజ్ఞులైన వైద్యులతో సేవలు అందుతున్నాయి.
ఈ ఐదేళ్లలో రోగుల సంఖ్య పెరిగింది. వైద్యం కోసం అన్ని వర్గాల ప్రజలు వస్తున్నారని సూపరింటెండెంట్ తెలిపారు. ప్రసవాలు సహా అత్యవసర శస్త్ర చికిత్సలు ఇక్కడే నిర్వహిస్తున్నట్టు చెప్పారు. స్వచ్ఛతా ప్రమాణాలు పాటిస్తున్న ప్రభుత్వాసుపత్రిగా జాతీయస్థాయి గుర్తింపు వచ్చింది.